Shoaib Akhtar: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మ్యాచ్‌పై నెలకొన్న సందిగ్దతకు ఐసీసీ తెరదించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన పాకిస్థాన్.. ఐసీసీ ఆంక్షలకు తలొగ్గి తమ నిర్ణయాన్ని మార్చుకుంది. భద్రతా కారణాలతో టీ20 ప్రపంచకప్ 2026 నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోమని ఐసీసీ హామీ ఇవ్వడంతో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ సిద్దమైంది.
భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను పునరుద్దరించాలని ఈ సందర్భంగా పీసీబీ డిమాండ్ చేయగా.. ఐసీసీ తిరస్కరించింది. తమ పరిధిలో లేని వ్యవహారమని, బీసీసీఐని ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడమని ఆదేశించలేమని స్పష్టం చేసింది. మిత్ర దేశాల విజ్ఞప్తుల నేపథ్యంలో బాయ్‌కట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది.
దాంతో ఆదివారం(ఫిబ్రవరి 15) కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ బాయ్‌కాట్ డ్రామా నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొలంబో పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటం.. పాకిస్థాన్‌లో ఐదుగురు స్పిన్నర్లు ఉండటం ఈ మ్యాచ్‌పై హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ ఉమ్రాన్ తారీక్ అద్భుత ప్రదర్శన కనబరుస్తుండటంతో భారత్‌కు గట్టి పోటీ ఎదురవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది.

అయితే ఈ చర్చ మధ్యలో కొన్ని ఫేక్ ట్వీట్స్, కామెంట్స్ కూడా నెటిజన్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. భారత్‌తో పాకిస్థాన్ జట్టును పోల్చడం సరికాదని, భారత ఆటగాళ్ల వాచీల ధర అంత కూడా పాక్ ఆటగాళ్ల సంపాదన ఉండదని షోయబ్ అక్తర్ మాట్లాడినట్లు ఓ ఫేక్ ట్వీట్ వైరల్‌గా మారింది.
'భారత ఆటగాళ్లతో పాకిస్థాన్ ప్లేయర్లను అస్సలు పోల్చలేరు. మా క్రికెటర్ల నెట్‌వర్త్ భారత ఆటగాళ్లు వాడే ఖరీదైన వాచులతో సమానం.'అని షోయబ్ అక్తర్.. ఓ ప్రముఖ భారత న్యూస్ ఛానెల్‌తో అన్నట్లు ఓ ఫేక్ ట్వీట్ వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ కామెంట్స్‌ను అక్తర్ ఎక్కడా అనలేదు. పాకిస్థాన్‌పై ఉన్న కోపంతో ఓ భారత నెటిజన్ క్రియేట్ చేసిన పోస్ట్ అని ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఎక్స్ ఏఐ చాట్‌బాట్ గ్రోక్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇది నకిలీ పోస్ట్ అని తేల్చింది. మెగా టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. ఆసియా కప్ 2025 టోర్నీలో మూడు మ్యాచ్‌లకు మూడింటిలోనూ భారత్‌పై పాకిస్థాన్ ఓటమిపాలైంది.