ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో దూకుడు కొనసాగిస్తామని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మైదానంలో భావోద్వేగాలను అదుపు చేసుకోవాలని తమ ఆటగాళ్లకు సూచించలేదన్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దూకుడు లేకుండా క్రీడల్లో కొనసాగలేమని ఈ ఇద్దరు సారథులు స్పష్టం చేశారు.
మంగళవారం ఆసియా కప్ 2025 టోర్నీ ప్రారంభానికి ముందు జరిగిన కెప్టెన్ల సమావేశంలో సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఈ టోర్నీలో ఆడే 8 జట్ల సారథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సూర్య, సల్మాన్ అలీ అఘాలు మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ప్రస్తావిస్తూ .. మైదానంలో ఆటగాళ్లు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి వారికి ప్రత్యేకమైన సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు.

అందుకు ఇరు కెప్టెన్లు అవసరం లేదని బదులిచ్చారు. దూకుడుగా ఉండటం ఆటలో ఒక భాగమని, తమ ఆటగాళ్లకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. 'దూకుడు ఎప్పుడూ ఉంటుంది. మైదానంలో మేము దూకుడుగానే ఉంటాం. దూకుడు లేకుండా ఆట ఆడలేం. రేపు(బుధవారం) యూఏఈతో మ్యాచ్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.'అని సూర్య బదులిచ్చాడు.
అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా ఇదే విషయం చెప్పాడు. 'దూకుడు గురించి ఏ ఆటగాడికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా చాలా భిన్నంగా ఉంటారు. ఏ ఆటగాడైనా మైదానంలో దూకుడుగా వ్యవహరించాలనుకుంటే వానిరి ఆ స్వేచ్ఛ ఉంది. పేసర్ల విషయానికి వస్తే వారు ఎప్పుడూ దూకుడుగానే ఉంటారు. వారిని మనం ఆపలేం. ఎందుకంటే వారిని ముందుకు నడిపించేదే దూకుడు. ఈ విషయంలో నా వైపు నుంచి మా ఆటగాళ్లకు ఎలాంటి సూచనలు చేయలేదు.'అని అలీ అఘా స్పష్టం చేశాడు.
ఆసియా కప్ 2025లో భారత జట్టు ఫేవరేట్ అని అనుకోవడం లేదని సల్మాన్ అలీ అఘా స్పష్టం చేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టును ఫేవరేట్ అనుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ రోజు ఏ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే ఆ జట్టే గెలుస్తుందన్నాడు. 'టీ20 క్రికెట్‌లో ఏ జట్టు ఫేవరేట్ కాదు. మ్యాచ్ రోజు ఏ జట్టు బాగా ఆడితే అదే గెలుస్తుంది. ఇది చాలా వేగవంతమైన గేమ్. కొన్ని ఓవర్లే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాయి.'అని సల్మాన్ అలీ అఘా చెప్పుకొచ్చాడు.