హైదరాబాద్‌లో క్రికెట్ అనగానే అందరికి గుర్తొచ్చేది హెచ్‌సీఏ.. ఉప్పల్ స్టేడియం. ఒకప్పుడు హెచ్‌సీఏ అంటే అంతర్గత కుమ్ములాటలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేది. మరోవైపు ఉప్పల్ స్టేడియం అంటే గాలికి ఊడిపోయిన కెనోపి.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని గ్రౌండ్.. పావురాల రెట్టలతో కూడిన సీట్లు దర్శనమిచ్చేవి. కానీ ఇవన్నీ మారిపోయాయి. అధునాతన హంగులతో స్టేడియాన్ని ముస్తాబు చేశారు.
గత ఐపీఎల్‌లో ఉప్పల్ స్టేడియానికి ఉత్తమ పిచ్ అవార్డ్ కూడా లభించింది. దీని వెనుక హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కృషి ఎంతో ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఆయన Mykhel Teluguతో ప్రత్యేకంగా మాట్లాడారు. అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్ కోసం స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లతో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఈసారి ఉప్పల్ మైదానంలో పరుగుల మోత మోగుతుందని, రికార్డ్ స్కోర్లు నమోదవుతాయని తెలిపారు.

1. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఉప్పల్ గ్రౌండ్‌ను ఎలా సిద్దం చేస్తున్నారు?
జగన్: గత రెండేళ్లుగా పునరుద్దరణ పనులు చేస్తూ స్టేడియాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాం. అయితే ఇంకా 30 శాతం పనులు బాకీ ఉన్నాయి. ఐపీఎల్ 2025 ప్రారంభమయ్యేవరకు మరో 10 శాతం పనులు పూర్తవుతాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత మిగతా పనులు పూర్తి చేస్తాం. ఐకానిక్ మెల్‌బోర్న్ గ్రౌండ్‌తో పోల్చుకునే స్థాయికి తీసుకు వస్తాం. మార్చి 23న ఇక్కడ తొలి మ్యాచ్ ఉంది. 20వ తేదీలోపు మేం ఈ పనులు పూర్తి చేయాలి.
2. ఒకప్పుడు ఉప్పల్ స్టేడియం చాలా అధ్వాన్నంగా ఉండేది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ స్టేడియాన్ని చూసి మీరేం అనుకున్నారు..?
జగన్: నేను దేశంలోని మిగతా స్టేడియాలతో పాటు ఇతర దేశాల క్రికెట్ స్టేడియాలను కూడా విజిట్ చేశాను. వాటితో పొల్చితే ఉప్పల్ స్టేడియం బాలేదనిపించింది. ఈ స్టేడియాన్ని పూర్తిగా మార్చాలనిపించింది. ఈ స్టేడియాన్ని పూర్తిగా మార్చేందుకే హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని అనిపించింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే స్టేడియం పునరుద్ధరణ పనులు ప్రారంభించాను. ప్రస్తుతం ఉన్న స్టేడియం నా విజన్‌లో 60-70 శాతమే. నా పదవి కాలం మరో ఏడాదిన్నర ఉంది. ఐపీఎల్ 2026కి ఉప్పల్ స్టేడియాన్ని మెల్ బోర్న్ స్టేడియానికి ధీటుగా తీర్చుదిద్దుతాను.
3. స్టేడియం పునరుద్ధరణ విషయంలో SRH ఫ్రాంచైజీ నుంచి సహాయ సహాకారాలు ఎలా ఉన్నాయి?
జగన్: సన్‌రైజర్స్, బీసీసీఐ నుంచి మాకు పూర్తి సహకారం లభిస్తోంది. ఈ సారి మేం SRH వాళ్లను స్టేడియం రినోవేషన్ పనులకు సహాయం చేయాలని కోరాం. వాళ్లు సానుకూలంగా స్పందించి కార్పోరేట్, వాష్‌రూమ్, పెయిటింగ్ రినోవేషన్ పనుల్లో సహకారం అందించారు. పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు కూడా సహాయం అందించాలని కోరాం. 1000 కార్లు పార్క్ చేసేలా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ స్పేస్‌ను క్రియేట్ చేయబోతున్నాం. అయితే ఇది ఐపీఎల్ 2026 వరకు అందుబాటులోకి వస్తుంది.
4. ఉప్పల్ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ వ్యవస్థ ఎలా ఉంది? ఇటీవల కటక్‌లో ఫ్లడ్ లైట్స్ ఆగి 20 నిమిషాల అంతరాయం ఏర్పడింది కదా?
జగన్: కటక్‌లో అలా జరగడం దురదృష్టకరం. ఫ్లడ్ లైట్స్ విషయంలో ఉప్పల్‌లో మూడంచెల బ్యాకప్ ఉంది. పవర్ బ్యాకప్, జనరేటర్-1, జనరేటర్-2 బ్యాకప్‌గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రాదని చెప్పను. కానీ వస్తే క్షణాల్లో సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఉప్పల్ మైదానానికి ఉంది.
5. గత సీజన్‌లో ఉప్పల్ వేదికగా రికార్డ్ స్కోర్లు నమోదయ్యాయి? ఈ సారి పిచ్‌లను ఎలా సిద్దం చేస్తున్నారు?
జగన్: సాధారణంగానే ఉప్పల్ స్టేడియం అంటేనే బ్యాటింగ్ పిచ్ అని అందరికి తెలుసు. గతేడాది ఇక్కడ 287 పరుగుల భారీ స్కోర్ నమోదైంది. ఈసారి 300 ప్లస్ స్కోర్ నమోదవుతుందనుకుంటున్నా.
6. SRHలో తెలుగు ప్లేయర్లు, ముఖ్యంగా తెలంగాణకు చెందిన ఆటగాళ్లు లేరు?
జగన్: తెలుగు ప్లేయర్లను తీసుకోవాలని SRH యాజమాన్యాన్ని హెచ్‌సీఏ తరఫున రిక్వెస్ట్ చేశాం. లోకల్ ప్లేయర్స్ ఉంటే టీమ్‌కు మరింత క్రేజ్ వస్తుందని కూడా చెప్పాం. కానీ ఆటగాళ్ల ఎంపిక అనేది ఫ్రాంచైజీ సెలెక్టర్లు, కోచ్‌లపై ఆధారపడి ఉంటుంది. ఈ సారి అవకాశం రాకపోయినా.. వచ్చే ఏడాది ముగ్గురు లేదా నలుగురు ప్లేయర్లు కచ్చితంగా SRHకు ఎంపికవుతారు.
7. తెలంగాణ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించే ప్రయత్నం జరగుతుందా?
జగన్: తెలంగాణ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించాలని మేం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నాం. ఐపీఎల్‌లో తెలంగాణ ప్రేయర్లకు అవకాశం దక్కడం లేదు. తిలక్ వర్మ, సిరాజ్ మినహా మరే ఆటగాడు లేడు. ఇతర రాష్ట్రాల ఆటగాళ్లకు లోకల్ ఫ్రాంచైజీ లీగ్స్ ఉండటంతో వారికి ఎక్కువగా ఆడే అవకాశం దక్కుతుంది. దాంతోనే మేం టీపీఎల్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నాం. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ టోర్నీని ప్రారంభిస్తాం.
8. హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తామని చెప్పారు? ఆ ప్రపోజల్ ఏ దశలో ఉంది?
జగన్: ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మా ప్రతిపాదనను చూసి వెంటనే అసెంబ్లీలో ప్రకటన చేశారు. దానికి సంబంధించిన పేపర్ వర్క్ కూడా జరుగుతోంది. స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వం 150 ఎకరాలను కేటాయించనుంది. నా పదవి కాలం ముగిసే లోపు స్టేడియం భూమి పూజ చేస్తాను.
9. ఈ ఏడాది ఉప్పల్ స్టేడియంలో మరిన్ని టీమిండియా మ్యాచ్‌లు చూడవచ్చా?
జగన్: ఈ ఏడాది ఉప్పల్‌లో ఓ టెస్ట్ మ్యాచ్‌తో కలిపి మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. గతేడాది ఎన్నికల కారణంగా ఓ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం కోల్పోయింది. ఆ మ్యాచ్‌ను మళ్లీ కేటాయించవచ్చు. ఏడాదిలో మూడు మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఇవ్వరు. గతేడాది మూడు మ్యాచ్‌లు జరిగాయి. మ్యాచ్‌ల కోసం అసోసియేషన్స్ మధ్య తీవ్ర పోటీ ఉంటుంది.
10. టీమిండియా క్రికెటర్లు హైదరాబాద్ ఫుడ్‌ను బాగా ఇష్టపడుతారని, జైషాతో కలిసి మీరు రోడ్‌సైడ్ ఫుడ్ తిన్నారనే ప్రచారం ఉంది. ఆ విశేషాలు ఏంటి?
జగన్: హైదరాబాద్ ఫుడ్‌ను భారత క్రికెటర్లు బాగా ఇష్టపడుతారు. ఇక్కడ ఏ ఫుడ్ ఎక్కడ ఫేమస్ అనే విషయం కూడా వారికి బాగా తెలుసు. బీసీసీఐ నమన్ అవార్డ్స్ కోసం జై షా ఇక్కడికి వచ్చినప్పుడు.. రోడ్ సైడ్ దోశ తినాలని ఉందని చెప్పారు. నేను నాకు తెలిసిన రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ దగ్గరకు తీసుకెళ్లి దోశ తినిపించాను. ఆయనతో పాటు సెక్యూరిటీ, ఇతర వ్యక్తులు, బీసీసీఐ అధికారులు 20-30 మంది దోశలు తిన్నారు. అందరూ ఆ టెస్ట్‌కు ఫిదా అయ్యారు.
11. ఐపీఎల్ నేపథ్యంలో నగర అభిమానులకు ఏం చెప్పాలనుకుంటున్నారు.?
జగన్: హైదరాబాద్ గ్రౌండ్ ఈ సారి ప్రేక్షకులకు మంచి అనుభూతినివ్వబోతుంది. నేను కోరేది ఒక్కటే కనీసం ఒక్క మ్యాచ్ అయినా వచ్చి స్టేడియంలో చూడండి. మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్స్ సేల్ మొదలైంది. టికెట్లను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయండి. ఆన్‌లైన్‌లో తప్పా టికెట్లను ఎక్కడా విక్రయించరు. ఫేక్ టికెట్స్ కొని మోసపోవద్దు. మ్యాచ్‌లకు వచ్చే వారందరూ వీలైనంత వరకు మెట్రోతో పాటు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించుకోండి.