ఆసియా కప్ 2025 టోర్నీలో వరుస విజయాలతో ఓటమెరుగని జట్టుగా దూసుకెళ్తున్న భారత జట్టును తాము ఓడిస్తామని బంగ్లాదేశ్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ అన్నాడు. భారత జట్టును ఓడించడం అసాధ్యమని ఎవరు అన్నారు? అని ప్రశ్నించాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా బుధవారం జరిగే సూపర్-4 మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఫిల్ సిమ్మన్స్.. భారత్‌ను ఓడించడం అసాధ్యమనే వ్యాఖ్యలను తప్పుబట్టాడు.
'భారత జట్టును ఓడించడం అసాధ్యం కాదు. ప్రతి జట్టుకూ భారత్‌ను ఓడించే సత్తా ఉంది. ఎందుకంటే మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్టే విజేతగా నిలుస్తుంది. ఆట జరిగే రోజు ఉత్తమ ప్రదర్శన కనబరిస్తే భారత్‌ను ఓడించవచ్చు. అంతే తప్పా గత రికార్డ్‌ల ఆధారంగా విజేతను నిర్ణయించలేం. గత మ్యాచ్‌ల విజయాల ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. మూడున్నర గంటల్లో ఎలా ఆడుతారో దాని ఆధారంగానే ఫలితం ఉంటుంది.

భారత్‌తో మ్యాచ్ అంటే చాలా హైప్ ఉంటుంది. ఎందుకంటే టీమిండియా వరల్డ్ నంబర్ 1 టీ20 టీమ్. కాబట్టి టీమిండియాతో మ్యాచ్ అంటే సహజంగానే హైప్ ఉంటుంది. ఈ హైప్‌ను మా ఆటగాళ్లు ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నా. బంగ్లాదేశ్ బౌలింగ్ విభాగం అద్భుతంగా ఉంది. భారత్‌తో మ్యాచ్‌లో వారు కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తారు. గత మ్యాచ్‌ల్లో కొన్ని పొరపాట్లు జరిగాయి. వాటిని సరిదిద్దుకుని భారత్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తాం. గత ఫలితాలను పట్టించుకోకుండా మెరుగైన ప్రదర్శన కనబర్చడంపైనే ఫోకస్ పెడ్తాం.
గత మ్యాచ్‌తో పోలిస్తే పిచ్‌లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. నేను చూసిన అత్యుత్తమ పిచ్‌ల్లో ఇది ఒకటి. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే పిచ్ ఇది. బౌలర్లు కాస్త నైపుణ్యం ప్రదర్శించాలి. కాబట్టి టాస్ గెలిచినా.. ఓడినా.. ఏం కాదు.'అని ఫిల్ సిమ్మన్స్ చెప్పుకొచ్చాడు.