
దుబాయ్: జట్టుకు భారమయ్యానని భావించిన మరు క్షణమే టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకుంటానని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. గత కొంత కాలంగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న మోర్గాన్.. ఈ ఏడాది ఏడు టీ 20 మ్యాచ్‌లు ఆడి 82 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌లోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. 17 మ్యాచ్‌ల్లో 11.08 సగటుతో 133 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతని ఫామ్‌పై తీవ్ర చర్చజరుగుతుంది. మోర్గాన్ జట్టుకు భారమయ్యాడనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
తాజాగా ఈ విమర్శలపై స్పందించిన మోర్గాన్.. తాను తప్పుకొంటే జట్టుకు ప్రయోజనం జరుగుతుందంటే ఆ పని చేస్తానని చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ సాధిస్తుందనుకుంటే జట్టుకు అడ్డుగా ఉండాలనుకోట్లేదని తెలిపాడు. తన ఫామ్‌ను తిరిగి పొందలేకపోతే జట్టు నుంచి తప్పుకొనేందుకు సిద్దమన్నాడు. తప్పుకుంటానన్నాడు. 'ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలుస్తుందంటే దానికి నేను అడ్డుగా ఉండను. అవసరమైతే జట్టు నుంచి తప్పుకునేందుకు సిద్దం. అయితే నేను పరుగులు చేయడంలో విఫలమైనా కెప్టెన్‌గా రాణించా. ఫామ్ కోల్పోయిన ప్రతిసారి బయటపడందే నేను ఈ స్థాయిలో ఉండను. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతాను. టీమ్ కష్టసమయంలో ఉన్నప్పుడే బ్యాటింగ్ చేయడం నాకు ఇష్టం. నా కెప్టెన్సీ బాగుంది. అవసరమైన సమయంలో తీసుకునే నిర్ణయాలు మ్యాచ్ గతినే మార్చేస్తాయి. నేను తప్పుకోవడం టీమ్‌కు ప్రయోజనం అనుకుంటే తప్పకుండా ఆ పని చేస్తాను'అని మోర్గాన్ వెల్లడించాడు.
బ్యాట్స్‌మెన్‌గా విఫలమైనా కెప్టెన్‌గా మోర్గాన్ మంచి ఫలితాలు సాధించాడు. అతని సారథ్యంలోనే ఇంగ్లండ్ 2016 ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లింది. 2019 వన్డే ప్రపంచకప్ గెలిచింది. ఐపీఎల్-2021లో బ్యాటింగ్‌లో విఫలమైన మోర్గాన్.. సారథిగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. కానీ టైటిల్‌ను మాత్రం అందించలేకపోయాడు. భారత్‌తో జరిగిన తొలి వామప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌కు ఇయాన్ మోర్గాన్ దూరంగా ఉండగా.. జోస్ బట్లర్ నాయకత్వం వహించిన ఆ మ్యాచ్‌లో బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు తేలిపోయారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. మొయిన్ అలీ(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్), జానీ బెయిర్ స్టో(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) చెలరేగారు. ఈ ఇద్దరికి తోడుగా లియామ్ లివింగ్ స్టోన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30) మెరుపులు మెరిపించాడు. అనంతరం భారత్.. కేఎల్ రాహుల్(24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51), ఇషాన్ కిషన్(46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీలతో 19 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 192 రన్స్ చేసి 6 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీశారు.
న్యూజిలాండ్‌తో నేడు ఇంగ్లండ్ తమ ఆఖరి వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో మెగాటోర్నీలో అడుగుపెట్టాలని భావిస్తోంది. వెస్టిండీస్‌తో 23న ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.