
ముంబై:టీమిండియాలో చాలా మంది ఆటగాళ్లకు ఇంగ్లండ్‌లో నిర్వహించే 'ది హండ్రెడ్' బాల్ క్రికెట్ లీగ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇతర లీగ్‌ల్లో పాల్గొనాలనే కొరిక ఉందని ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్, కోల్‌కతా నైట్ రైడర్స్ సారథి ఇయాన్ మోర్గాన్ అన్నాడు. హండ్రెడ్ లీగ్ గురించి భారత ఆటగాళ్లతో చర్చించానని.. అయితే, చాలా మంది టీమిండియా క్రికెటర్లకు అందులో ఆడాలని ఉందన్నాడు.
తాజాగా స్కై స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సెన్‌తో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'టీమిండియా క్రికెటర్లకు కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్నా, అక్కడి సంప్రదాయాలు తెలుసుకోవాలన్నా చాలా ఇష్టం. వారికి ది హండ్రెడ్ లీగ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఇతర లీగుల్లోనూ పాల్గొనాలని ఉంది. వారు ఆడితే ఆయా లీగ్‌లకు క్రేజ్ వస్తుంది.
అయితే, ఇలాంటి లీగ్‌లతో కొన్ని దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న క్రికెట్ లీగ్‌ల కారణంగా కొన్ని దేశాలు అత్యుత్తమ తుది జట్లను బరిలోకి దింపలేకపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. ఆటలో ఏమాత్రం కొత్త మార్పులు రావట్లేదు. మనం ముందుకెళ్లేకొద్దీ కొత్తగా ప్రయత్నించాలి. ఈ నేపథ్యంలోనే ఐసీసీ వాటిపై దృష్టిసారించాలి' అని మోర్గాన్ పేర్కొన్నాడు.
అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు ఫార్మాట్ల క్రికెట్ కలిసిపోయిందని, దాంతో వాటికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్నాడు. 'టీ20 క్రికెట్ అనేది యువ క్రికెటర్లదని, ఇలాంటి టోర్నీల్లో స్టార్ ఆటగాళ్లతో కలిసి వాళ్లు ఆడాలనుకుంటారు. అలాగే వన్డేలకు వచ్చేసరికి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఒక్కరోజు ఆడే ఆటలో అన్ని కోణాలూ ఉంటాయి. ఇక టెస్ట్ క్రికెట్ ప్రధాన ఆటగాళ్లకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఫార్మాట్. అయితే, కొన్ని దేశాలే టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి'అని మోర్గాన్ చెప్పుకొచ్చాడు.
ఇక 'ది హండ్రెడ్' అనేది వంద బంతుల క్రికెట్ లీగ్. గతేడాది ఇంగ్లండ్ ఈ టోర్నీని నిర్వహిచాలని భావించింది. కానీ, కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో ఈ ఏడాది నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్న భారత్ ఆటగాళ్లకు విదేశీ లీగ్‌లు ఆడే అవకాశం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతే ఇతర లీగ్‌లు ఆడవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఇయాన్ మోర్గాన్ సమాయత్తం అవుతున్నాడు. గత సీజన్ మధ్యలో జట్టు పగ్గాలు అందుకున్న అతను.. ఈ సారి టైటిల్ అందిచడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఏప్రిల్ 9 నుంచి ఈ మెగాటోర్నీకి తెరలేవనుండగా.. కేకేఆర్ ఏప్రిల్ 11న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.