
మాంచెస్టర్: విజయమే లక్ష్యంగా వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆ దిశగా పయనిస్తోంది. బెన్ స్టోక్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో 129/3 పరుగుల వద్ద డిక్లెర్ చేసిన ఆతిథ్య జట్టు ప్రత్యర్థి ముందు 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓవర్‌నైట్ స్కోర్ 37/2తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ వేగంగా ఆడింది. క్రీజులో ఉన్న బెన్ స్టోక్స్ (78 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో వేగంగా 100 పరుగుల మార్క్‌ను అందుకుంది. కెప్టెన్ జోరూట్ (22) ఔటైనా.. ఒలి పోప్(12) సాయంతో స్టోక్స్ ఇన్నింగ్స్‌ను పరుగెత్తించాడు. తన భీకర బ్యాటింగ్‌తో విండీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఎక్కువ తనే స్ట్రైక్ తీసుకుంటూ.. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇక 312 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కాంప్‌బెల్(4)ను స్టువర్ట్ బ్రాడ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం 7 ఓవర్లలో వెస్టిండీస్ 17/1 పరుగులు చేసింది. క్రీజులో క్రైగ్ బ్రాత్‌వైట్(11 బ్యాటింగ్) హై హోప్(2 బ్యాటింగ్) ఉన్నారు. ఇక ఇంగ్లండ్ విజయానికి 9 వికెట్లు కావాల్సి ఉండగా.. వెస్టిండీస్ 296 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ రోజు మొత్తం బ్యాటింగ్ చేస్తేనే విండీస్ ఓటమి నుంచి తప్పించుకోగలదు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 469 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టోక్స్ 176 పరుగులతో రాణించగా.. డామ్ సిబ్లీ(120) శతకం బాదాడు. అనంతరం వెస్టిండీస్ 287 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ క్రైగ్ బ్రాత్ వైట్(75), బ్రూక్స్ (68), చేజ్(51) ఆదుకున్నారు. అనూహ్యంగా స్టువర్ట్ బ్రాడ్(3/66) చెలరేగి విండీస్ పతనాన్ని శాసించాడు.