
మాంచెస్టర్: పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి సంతోషంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దూరమయ్యాడు. కుటుంబ కారణాల వల్ల అతడు మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటంలేదని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆదివారం వెల్లడించింది.
'మరో వారం రోజుల్లో స్టోక్స్ న్యూజిలాండ్ వెళ్లనున్నాడు. దీంతో పాకిస్థాన్‌తో ఈ నెల 13,21 నుంచి జరిగే చివరి రెండు టెస్ట్‌లకు అతను అందుబాటులో ఉండడు. తిరిగి జట్టుతో ఎప్పుడు కలుస్తాడనే విషయాన్ని తర్వాత వెల్లడిస్తాం'అని ఈసీబీ ప్రకటనలో పేర్కొంది.
న్యూజిలాండ్‌లో ఉన్న తల్లిదండ్రుల జెడ్, డెబ్ స్టోక్స్‌ను కలిసేందుకు స్టోక్స్ వెళ్తున్నాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి. తండ్రి డెబ్ స్టోక్స్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇక పాక్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం ముగిసిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లోస్టోక్స్ దారుణంగా విఫలమైనప్పటికీ.. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అదరగొట్టాడు.
ఈ సమ్మర్‌లో స్టోక్స్ ఇప్పటికే నాలుగు టెస్ట్‌లు ఆడాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. తర్వాతి రెండు టెస్ట్‌ల్లోనూ ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషించి ఇంగ్లండ్‌కు 2-1తో సిరీస్‌ను అందించాడు. తొలి టెస్ట్‌లో సారథిగా విజయాన్నందించకపోయినా.. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక రెండో టెస్ట్‌లోనైతే అతని విశ్వరూపాన్ని చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు.. రెండు ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో (78 నాటౌట్) అజేయంగా నిలిచాడు. బౌలింగ్‌లో కీలక మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు.