
అలీ డకౌట్:
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు శుభారంభం లభించలేదు. మొదటినుంచి ఇంగ్లండ్ బౌలర్లను బాగానే ఎదుర్కొన్న ఓపెనర్ ఆబిద్ అలీ (16).. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. మరో మూడు ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్‌కు భారీ షాక్ తగిలింది. క్రీజులో పది నిమిషాలు నిలువకముందే కెప్టెన్ అజహర్ అలీ (0)ని క్రిస్ వోక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో పాక్ 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజమ్.. షాన్ మసూద్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
బాబర్ బౌండరీల మోత:
ఆరంభంలో కాస్త తడబడిన బాబర్ ఆజమ్ క్రీజులో కుదురుకున్నాక బౌండరీల మోతమోగించాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆరంభంలో ఎదుర్కొన్న 22 బంతుల్లో కేవలం 2 పరుగులే చేసిన బాబర్.. 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. బాబర్ అండతో మసూద్ కూడా చెలరేగాడు. ఇద్దరు కలిసి అబేధ్యమైన మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. ఈ దశలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ రెండు గంటల పాటు నిలిచిపోయింది.

వెలుతురు లేమి కారణంగా:
అనంతరం ఆట తిరిగి ప్రారంభమైనా.. వెలుతురు లేమి కారణంగా కేవలం 8 ఓవర్లే పడ్డాయి. పాకిస్తాన్ ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, ఆర్చర్ చెరో వికెట్ పడగొట్టారు. వర్షంతో పాటు వెలుతురు లేమితో తొలిరోజు 41 ఓవర్ల ఆట జరగలేదు.

నోబాల్ టీవీ అంపైర్‌కే:
ఇంగ్లండ్-పాకిస్తాన్ మ్యాచ్ ద్వారా టెస్టుల్లోనూ ఫ్రంట్ ఫుట్ నోబాల్ బాధ్యతను టీవీ అంపైరే చూసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఇంగ్లండ్-ఐర్లాండ్ సిరీస్‌లో ప్రవేశపెట్టిన ఈ నిబంధనను టెస్టుల్లోనూ కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించింది. 'ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో ఫ్రంట్ ఫుట్ నోబాల్ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. ఫలితాలు చూశాక భవిష్యత్తులో సుదీర్ఘ ఫార్మాట్‌లో దీన్ని వినియోగించాలా వద్దా అని నిర్ణయిస్తాం' అని ఐసీసీ బుధవారం ట్విట్టర్‌లో పేర్కొంది.


Click it and Unblock the Notifications












