
ముంబై: గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముంబై మహానగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం అయితే భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా బీభత్సం సృష్టించాయి. వేగంగా వీచిన గాలుల ధాటికి పలుచోట్ల హోర్డింగ్‌లు, చెట్లు కుప్పకూలాయి. ఒకోచోట పెద్ద పెద్ద భవనాలు సైతం దెబ్బ తింటున్నాయి. ఈ క్రమంలోనే ప్రఖ్యాత డీవై పాటిల్ స్టేడియం దారుణంగా దెబ్బతింది.
బుధవారం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి నవీ ముంబైలోని ప్రఖ్యాత డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం ధ్వంసమైంది. పైకప్పులో కొంతభాగం కిందపడిపోయింది. పైకప్పులు విరిగి కింద పడటంతో పాటు స్టేడియంలో పలుచోట్ల విధ్వంసం చోటుచేసుకుంది. ఈదురు గాలుల ధాటికి స్టేడియంలో భారీగానే నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. త్వరలోనే స్టేడియంగా పనులు ప్రారంభిస్తారని సమాచారం. ప్రస్తుతం దెబ్బతిన్న స్టేడియం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు వర్షం, ఈదురు గాలుల ధాటికి బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) కార్యాయలంపై ఉండే సైన్ బోర్డు కూడా ధ్వంసమైంది. గాలులు ధాటికి ఒరిగిపోయి గాల్లో వేలాడుతోంది. ఆ సైన్ బోర్డు కింద పడితే.. తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని, అది కింద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు బీఎస్ఈ అధికారులు తెలిపారు.
పూణే, సతారా, కొల్లాపూర్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. చెంబూర్, పరేల్, హింద్మాతా, వడాలా మరియు ముంబైలోని ఇతర లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో బృహన్ ముంబై కార్పొరేషన్ అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్‌ను రంగంలోకి దింగి సహాయక చర్యలను చేపట్టింది. రోడ్లపై కూలిపోయిన చెట్లు, హోర్డింగ్‌లను తొలగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పలు బృందాలను సిద్ధంగా ఉంచారు.