
లార్డ్స్: న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే (347 బంతుల్లో 22 ఫోర్లు, సిక్స్‌తో 200) దుమ్మురేపుతున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సూపర్ బ్యాటింగ్‌తో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా సంతతికి చెందిన ఈ కివీస్ ఓపెనర్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిక్స్‌తో తనదైన శైలిలో డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం అయితే.. తన ఇన్నింగ్స్ మొత్తం ఇదే ఫస్ట్ సిక్స్ కావడం మరో విశేషం.
బుధవారం తొలి రోజు ఆటలో సెంచరీతో.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 25 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన కాన్వే.. గురువారం రెండో రోజు ఆటలో 125 ఏళ్ల మరో అరుదైన ఘనతను అధిగమించాడు. ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్ర టెస్ట్‌లో అత్యధిక స్కోర్ చేసిన కేఎస్ రంజీత్‌సిన్‌హ్‌జీ(154 నాటౌట్)ని తాజా ఇన్నింగ్స్‌తో కాన్వే వెనక్కునెట్టాడు. భారత్‌కు చెందిన రంజీత్‌సిన్‌హ్‌జీ బ్రిటీష్ ఇండియా తరఫున 1896లో ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్‌లో 154 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్‌గా ఉండగా.. తాజాగా కాన్వే బద్దలు చేశాడు.
విదేశీ గడ్డపై అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లోనే అత్యధిక స్కోర్ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో టిప్ ఫోస్టర్(ఇంగ్లండ్)-287, జాక్వెస్(సౌతాఫ్రికా), 222 నాటౌట్, కైల్ మేయర్స్(వెస్టిండీస్) 210 నాటౌట్ కాన్వే కన్నా ముందున్నారు.
ఇక డెవాన్ కాన్వే సూపర్ డబుల్ సెంచరీతో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఆధిపత్యం కొనసాగింది. 246/3 ఓవర్‌నైట్ స్కోర్ రెండో రోజు ఆటను ప్రారంభించిన కివీస్.. 122.4 ఓవర్లలో 378 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఓలీ రాబిన్సన్(4/75), మార్క్ వుడ్(3/81) రాణించడంతో ఓవైపు కాన్వే నిలకడగా ఆడుతున్న మరోవైపు కివీస్ బ్యాట్స్‌మన్ పెవిలియన్ క్యూ కట్టారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ హెన్రీ నికోలస్(60)తో కలిసి 42 రన్స్ జోడించిన కాన్వే.. ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందకపోయినా నిలకడగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి వాట్లింగ్(1), కోలిన్ డీ గ్రాండ్ హోమ్(0), మిచెల్ సాంట్నర్(0), కైల్ జెమీసన్(9), టీమ్ సౌతీ(8) విఫలమయ్యారు. వాగ్నర్(25 నాటౌట్) సాయంతో కాన్వే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.