
లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్ అనంతరం 'బజ్ బాల్' అనే పదం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ కోచింగ్ తీరును విశ్లేషిస్తూ కొందరూ ఈ పద ప్రయోగం చేశారు. ఆస్ట్రేలియా చేతిలో గత యాషెస్ సిరీస్‌లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ ఆ తర్వాత మెక్ కల్లమ్ పర్యవేక్షణలో అద్భుతంగా పుంజుకొంది. టెస్టుల్లో తమ అత్యధిక లక్ష్య ఛేదన (378) రికార్డును సృష్టించింది.
బ్రెండన్ మెక్‌కల్లమ్ - బెన్‌స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు టెస్టుల్లోనూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తోంది. అయితే మెక్‌కల్లమ్ ముద్దుపేరు బజ్. పరుగులు చేయడానికి ప్రతి బంతి ఓ అవకాశమే, కేవలం మనుగడ కోసం క్రీజులో ఉండిపోకూడదనేది అతని సిద్ధాంతం. దాంతో అతని కోచింగ్ బజ్ బాల్ అనే పదంతో కొనియాడటం మొదలు పెట్టారు.
అయితే, ఇలాంటి పదం తన పేరుపైనే వచ్చినప్పటికీ అదంతా సిల్లీ టర్మ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ కొట్టిపడేశాడు. 'బజ్‌బాల్‌పై నాకైతే ఎటువంటి ఐడియా లేదు. అయితే, మా ఆటగాళ్లు (ఇంగ్లాండ్) చాలా బాగా ఆడారు. పాజిటివ్‌గా ముందుడుగు వేస్తే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. దూకుడుగా ఆడటమే కాకుండా ఏ విధంగా మ్యాచ్‌ను తీసుకెళ్లారనేది చాలా కీలకం. అందుకే ఇలాంటి పదాలను (బజ్‌బాల్) నేను నమ్మను. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచడంతోపాటు మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఒత్తిడికి అనుగుణంగా బ్యాటర్లు స్పందించారు.
ఇక జోష్ హేజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్ 'బజ్‌బాల్' గురించి చేసిన కామెంట్లను విన్నా. మేం ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు తప్పకుండా ఛాలెంజ్‌ను స్వీకరిస్తాం' అని మెక్‌కల్లమ్ పేర్కొన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం తనకు బజ్ బాల్ అంటే ఏంటో తెలియదని చెప్పాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే.