IND vs ENG:అండర్సన్ ఔట్.. రాబిన్సన్ డౌట్.. నాలుగో టెస్ట్‌లో భారత్‌తో తలపడే ఇంగ్లండ్ తుది జట్టు ఇదే!

హైదరాబాద్: లీడ్స్ టెస్ట్‌లో భారత్‌పై అద్భుత విజయాన్నందుకున్న ఇంగ్లండ్ మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. గురువారం నుంచి ఓవల్ వేదికగా ప్రారంభంకానున్న నాలుగో టెస్ట్‌లో కోహ్లీసేనతో అమీతుమీ తేల్చుకోనుంది. లార్డ్స్ టెస్ట్ పరాజయం నుంచి త్వరగానే పాఠాలు నేర్చుకున్న ఆతిథ్య జట్టు అచ్చొచ్చిన మైదానంలో అదరగొట్టి ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ ఘన విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో లెక్కను సరిచేసింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో నాలుగో టెస్ట్‌కు సిద్దమవుతోంది. మరోవైపు పేలవ బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకున్న కోహ్లీసేన.. దెబ్బతిన్న పులిలా గర్జించేందుకు రెడీ అవుతోంది.

భారీ మార్పులు..
78 పరుగులకు ఆలౌటైన అవమానానికి ఆటతోనే బదులివ్వాలనే కసితో ఉంది. దాంతో నాలుగో టెస్ట్ సైతం హోరాహోరీగా జరగనుంది. అభిమానులకు కావాల్సిన మజా అందనుంది. పేపర్‌పై ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునేలా ఉన్నాయి. ఇప్పటికే వికెట్ కీపర్ జోస్ బట్లర్.. తన రెండో సంతానం కోసం పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడు. ప్రస్తుతం అతని సతీమణి గర్భవతి కాగా.. ప్రసవ సమయంలో ఆమె పక్కనే ఉండేందుకు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. జోస్ బట్లర్ గైర్హాజరీ నేపథ్యంలో జానీ బెయిర్ స్టో వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక బట్లర్‌కు రిప్లేస్‌మెంట్‌గా సామ్ బిల్లింగ్స్ జట్టులోకి వచ్చాడు.

జేమ్స్ అండర్సన్ ఔట్..
ఇక స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్, యువ పేసర్ ఓలీ రాబిన్సన్‌లలో ఒకరు నాలుగో టెస్ట్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్ ప్లేయర్ల రొటేషన్ పాలసీలో భాగంగా ఈ ఇద్దరిలో ఒకరికి విశ్రాంతివ్వనున్నారు. మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ గాయాల నుంచి కోలుకోవడంతో.. వరుసగా మూడు టెస్ట్‌లు ఆడిన అండర్సన్, రాబిన్సన్‌లో ఒకరికి విశ్రాంతి ఇవ్వనున్నారు. ఇక ఓవల్ మైదానం వేదికగా చెత్త రికార్డు ఉండటంతో పాటు.. సీనియర్ పేసర్‌గా అండర్సన్‌పై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో అతనికే విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్ కోచ్ సిల్వర్ వుడ్ కూడా ఈ అండర్సన్ రెస్ట్‌పై హింట్ ఇచ్చాడు.

సకీబ్‌పై వేటు..
అండర్సన్ స్థానంలో క్రిస్ వోక్స్ రావడం ఖాయం కాగా.. సకీబ్ మహమూద్ ప్లేస్‌లో మార్క్ వుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. జోస్ బట్లర్ తప్పుకోవడంతో ఇంగ్లండ్ మరో ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్‌తో దిగే అవకాశం లభించింది. ఓలీ పోప్ లేదా డానియల్ లారెన్స్‌లలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. బిల్లింగ్స్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మూడో టెస్ట్‌లో టాప్-4 బ్యాట్స్‌మన్ దుమ్ములేపారు. ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. జట్టులోకి వచ్చిన టీ20 హిట్టర్ డేవిడ్ మలాన్ హాఫ్ సెంచరీ బాదాడు. ఇక సిరీస్ ఆసాంతం రాణిస్తున్న కెప్టెన్ జో రూట్ జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సిరీసులో రూట్ మూడు శతకాలు బాదిన విషయం తెలిసందే. మొత్తానికి టాప్-4 ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్ మొయిన్ అలీ రాణించాల్సి ఉంది.

ఇంగ్లండ్ తుది జట్టు (అంచనా)
రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (కీపర్), సామ్ బిల్లింగ్స్/ఓలీ పోప్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రెయిగ్ ఓవర్టన్,ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications