
లండన్: న్యూజిలాండ్, భారత్‌తో టెస్ట్ సిరీస్‌ల ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. పూర్తిగా కోలుకున్న జోఫ్రా ఆర్చర్‌కు గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో మరోసారి అతని కుడి మోచేతికి సర్జరీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌కు అతను దూరమవ్వగా.. భారత్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఆర్చర్ కుడి చేతికి ఇది రెండో శస్త్రచికిత్స.
'ఆర్చర్ కుడి మోచేతి గాయాన్ని వైద్య సిబ్బంది పరీక్షించారు. అతనికి సర్జరీ జరగనుంది. మరింత సమాచారం త్వరలో తెలియజేస్తాం" అని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది.అయితే అతను కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో మాత్రం వెల్లడించలేదు. కానీ అతను కనీసం భారత్‌తో రెండు టెస్టులకైనా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది ప్రారంభం నుంచి గాయాలతో సతమతమవుతూ వచ్చిన ఆర్చర్ టీమిండియాతో జరిగిన సిరీస్‌లో మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ ఏడాది మార్చిలో గాయంతోనే భారత పర్యటనకు వచ్చిన అతను.. మోచేతి కీలుకు ఇంజక్షన్లు తీసుకున్నాడు. కానీ నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన అతను.. వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇంగ్లండ్ వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు.
ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కౌంటీ క్రికెట్‌లో దుమ్మురేపాడు. అతను వేసిన బనాన ఇన్ స్వింగర్ నెట్టింట హల్‌చల్ చేసింది. ఇంతలోనే గాయం మళ్లీ తిరగబెట్టడంతో వైద్యులను సంప్రదించాడు. దీంతో వాళ్లు శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. ఐపీఎల్ 2021 సెకండాఫ్‌ను ఇంగ్లండ్ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది. సెప్టెంబర్‌లో లీగ్ జరిగే సూచలను కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఆర్చర్ కోలుకుంటే రాజస్థాన్ రాయల్స్‌కు అదృష్టం కలిసొచ్చినట్లే.