
చెన్నై: ఐపీఎల్ 2021 మినీ వేలంలో అమ్ముడుపోకపోవడంపై తనకెలాంటి బాధలేదని ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ తెలిపాడు. చెన్నై వేదికగా గురువారం జరిగిన మినీ వేలంలో ఈ ఇంగ్లండ్ ఓపెనర్‌ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. 2 కోట్ల కనీస ధరకు కూడా ఎవరూ తీసుకోలేదు. దాంతో రాయ్ ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ విషయంపై ట్విటర్ వేదికగా స్పందించిన అతను.. వేలంలో భారీ ధర పలికి తన సహచర ఆటగాళ్లకు అభినందనలు తెలిపాడు.
'ఐపీఎల్ మినీ వేలంలో అమ్ముడుపోనందుకు నేనేం బాధపడట్లదు.. అలా అని అవమానభారంగాను ఫీలవ్వను. నా ప్రదర్శన వారిని మెప్పించలేదు.. అందుకే ఎంపికవ్వలేదు. ఈ విషయం గురించి ఆలోచించనవసరం లేదు. అయితే వేలంలో మంచి ధర దక్కించుకున్న ఆటగాళ్లకు నా అభినందనలు. ముఖ్యంగా జేమిసన్, క్రిస్ మోరిస్, మ్యాక్స్‌వెల్ లాంటి వారు అధిక ధరకు అమ్ముడుపోవడం మంచి పరిణామం. నేను ఈ ఐపీఎల్ ఆడకపోవచ్చు.. కానీ మ్యాచ్‌లన్నీ కచ్చితంగా చూస్తా' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక గత ఐపీఎల్ 2020 సీజన్‌లో జాసన్ రాయ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ గాయం కారణంగా రాయ్ ఒక్క మ్యాచ్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. దాంతో ఢిల్లీ అతని స్థానంలో డానియల్ సామ్స్‌కు అవకాశం ఇచ్చింది. తాజా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ రాయ్‌ను రిలీజ్ చేసింది. మరోవైపు అతని సహచర ఆటగాడు మొయిన్ అలీకి మాత్రం వేలంలో మంచి ధర దక్కింది. ఆర్‌సీబీ రిలీజ్ చేసిన అలీని సీఎస్‌కే రూ.7కోట్లకు కొనుగోలు చేసింది.
ఇక మిగిలిన విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ చరిత్రలోనే 16.25 కోట్లకు రాజస్తాన్‌కు అమ్ముడుపోగా.. న్యూజిలాండ్ బౌలర్ కైల్ జేమిసన్ 15 కోట్లు(ఆర్‌సీబీ), ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూ. 14.25 కోట్లు(ఆర్‌సీబీ), జై రిచర్డ్‌సన్ రూ.14 కోట్లు(పంజాబ్ కింగ్స్) దక్కించుకున్నారు.