ENG vs SL: క్రికెట్‌లో వైడ్ బాల్‌కు వికెట్ కీపర్లు స్టంపౌట్ చేయడం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ రనౌట్ చేయడం మాత్రం చాలా అరుదు. వికెట్ కీపర్ ఏదైనా తప్పిదం చేసి బంతిని వదిలిస్తే బ్యాటర్ పరుగుకు ప్రయత్నించినప్పుడు.. ఇతర ఫీల్డర్ సాయంతో రనౌట్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ వైడ్ బాల్‌ను నేరుగా అందుకొని నాన్‌స్ట్రైకర్ వైపు ఉన్న బ్యాటర్‌ను రనౌట్ చేయడం మాత్రం చాలా అరుదు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక కెప్టెన్, వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ తెలివికి ఇంగ్లండ్ బ్యాటర్ ఆదిల్ రషీద్ బలయ్యాడు. ఇలా కూడా రనౌట్ చేస్తారా? అంటూ బిత్తిరిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. కుశాల్ మెండీస్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆదిల్ రషీద్ వేసిన 32వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ చివరి బంతిని తీక్షణ వైడ్ వేయగా.. అందుకున్న వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ నేరుగా నాన్‌స్ట్రైకర్ వికెట్లను కొట్టాడు. ఆ సమయంలో ఆదిల్ రషీద్ క్రీజు ధాటి ఉండటంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ విషయాన్ని రిప్లేలో పరిశీలించిన అంపైర్లు ఆదిల్ రషీద్‌ను ఔట్‌గా తేల్చారు. ఈ అనూహ్య ఘటనతో ఆదిల్ రషీద్ తెల్ల మొహం వేసాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(73 బంతుల్లో 6 ఫోర్లతో 43), జానీ బెయిర్ స్టో(31 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార(3/35), ఏంజెలో మాథ్యూస్(2/14), కాసున్ రజితా (2/36), మహీశ్ తీక్షణ(1/21) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 25.4 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్), సదీరవిక్రమా(54 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే(2/30) రెండేసి వికెట్లు తీసారు.