England vs Sri Lanka: వన్డే క్రికెట్ చరిత్రలోనే శ్రీలంక చెత్త రికార్డు.. సిరీస్ ఇంగ్లండ్ కైవసం!

కెన్నింగ్టన్: ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంక పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌లో 0-3తో క్వీన్ స్వీప్ అయిన లంక.. వన్డే సిరీస్‌లోనూ వాష్ ఔటయ్యే దిశగా కొనసాగుతోంది. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన పెరీరా సేన.. రెండో వన్డేలోనూ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ ఓటమితో శ్రీలంక వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అత్యధిక వన్డేలు ఓడిపోయిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది.

428 మ్యాచ్‌ల్లో ఓటమి..
ఇప్పటి వరకు 860 వన్డే మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక 390 విజయాలు సాధించి, 428 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 5 మ్యాచ్‌లు టై అవ్వగా.. 37 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. శ్రీలంక తర్వాత 427 పరాజయాలతో భారత్ ఉంది. అయితే వన్డే క్రికెట్‌లోనే అత్యధికంగా 993 మ్యాచ్‌లు ఆడింది భారతే. ఇందులో 516 విజయాలు టీమిండియా సొంతమవ్వగా... 9 మ్యాచ్‌లు టై అయ్యాయి. 41 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా కొనసాగుతోంది. 955 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్.. 579 విజయాలు సాధించింది. 333 మ్యాచ్‌లు ఓడిపోగా... 9 మ్యాచ్‌లు టై అయ్యాయి. మరో 34 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

చెలరేగిన సామ్ కరన్..
ఇక భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి ధాటక ముగిసిన మ్యాచ్‌లో లంక తేలిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 241 పరుగులు చేసింది. ధనుంజయ డిసిల్వా(91) తృటిలో శతకం చేజార్చుకోగా.. డసన్ షనక(47) హాఫ్ సెంచరీ అందుకోలేకపోయాడు. ఈ ఇద్దరు మినహా మరే బ్యాట్స్‌మన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కెప్టెన్ కుశాల్ పెరీరా(0) సైతం తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్(5/48) సంచలన బౌలింగ్‌తో లంక పతనాన్ని శాసించాడు. అతనికి అండగా డేవిడ్ విల్లే(4/64) రాణించడంతో లంక ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

రాణించిన ఇంగ్లండ్ త్రయం
242 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43 ఓవర్లలో 2 వికెట్లకు 244 పరుగులు చేసి మరో 42 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఇంగ్లండ్ త్రయం జాసన్ రాయ్(60), జోరూట్ (68 నాటౌట్), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(75 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓపెనర్లు రాయ్, బెయిర్ స్టో(29) తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించగా.. 140 పరుగుల కీలక పార్టనర్‌షిప్‌తో రూట్, మోర్గాన్ మ్యాచ్‌ను ముగించారు. లంక బౌలర్లలో హసరంగా, చమిక కరుణరత్నే తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications