తాను రికార్డుల కోసం ఆడే ఆటగాడిని కాదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ జో రూట్ స్పష్టం చేశాడు. సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో జో రూట్ వరుస శతకాలతో రికార్డుల మోత మోగిస్తున్నాడు. రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు సాధించిన జోరూట్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్(33) సెంచరీల రికార్డును అధిగమించాడు.
34 టెస్ట్ సెంచరీలతో జో రూట్ పదో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో సెంచరీ చేస్తే అతను ఏకంగా ఆరో ర్యాంక్‌లోకి దూసుకెళ్లనున్నాడు. ఈ క్రమంలో సచిన్ అత్యధిక సెంచరీ, పరుగుల రికార్డులను జో రూట్ అధిగమిస్తాడనే చర్చ జోరుగా సాగుతోంది. అత్యధిక పరుగుల జాబితాలో జో రూట్ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్నాడు.

రికార్డుల కోసం ఆడను..
ఈ క్రమంలోనే సచిన్ రికార్డ్‌ను అధిగమిస్తావా? అన్న ప్రశ్నకు జో రూట్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 'సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల టెస్ట్ రికార్డును నేను పట్టించుకోవడం లేదు. అసలు నేను రికార్డుల కోసం ఆడే ఆటగాడిని కాదు. కేవలం జట్టు విజయం కోసమే నా వంతు పరుగులు చేస్తున్నా. సెంచరీలు చేయడం గొప్పే కానీ.. జట్టు విజయం సాధించినప్పుడు దక్కే సంతోషం కంటే ఏది గొప్ప అనుభూతినివ్వదు.
నా ఆటను ఆడేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నా. జట్టు కోసం పరుగులు చేస్తున్నా. స్కోర్ బోర్డుపై మరిన్ని పరుగులు ఉంచితే మా బౌలర్లు స్వేచ్చగా బౌలింగ్ చేస్తారు. సెంచరీ చేసినప్పుడు ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది. కానీ జట్టు విజయం సాధించినప్పుడు రెట్టింపు ఆనందం లభిస్తోంది. ఆ విజయంలో మన పాత్ర ఉంటే మరింత కిక్కిస్తోంది. ఇలాగే నిలకడగా ఆడే ప్రయత్నం చేస్తాను.'అని జోరూట్ చెప్పుకొచ్చాడు.
మరో నాలుగేళ్లు ఆడితే..
టెస్ట్‌లో అత్యధిక సెంచరీలు, పరుగుల రికార్డు భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిటే ఉంది. టెస్ట్‌ల్లో 51 సెంచరీలు చేసిన సచిన్.. 15,921 రన్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ నెలకొల్పిన ఈ ఆల్‌టైమ్ రికార్డ్స్‌ను అధిగమించాలంటే జో రూట్ మరో 18 శతకాలతో పాటు 3,544 పరుగులు చేయాలి. 22 ఏళ్ల వయసున్న జోరూట్ మరో నాలుగేళ్ల పాటు ఇదే ఫామ్ కనబరిస్తే.. సునాయసంగా ఈ రికార్డ్స్‌ను అధిగమిస్తాడు.

గెలుపు దిశగా ఇంగ్లండ్..
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జోరూట్(143), గస్ అట్కిన్సన్(118) శతకాలతో 427 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం శ్రీలంక 196 పరుగులకే కుప్పకూలింది. 231 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 251 పరుగులకు కుప్పకూలింది. జో రూట్(121 బంతుల్లో 10 ఫోర్లతో 103) శతకం సాధించాడు. దాంతో శ్రీలంక ముందు 483 పరుగుల లక్ష్యం నమోదవ్వగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 53/2తో నిలిచింది.