ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్ తరఫున 50 శతకాలు నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు నమోదు చేయడం ద్వారా జో రూట్ ఈ ఫీట్ సాధించాడు.
ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు. 100 సెంచరీలతో టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 664 మ్యాచ్‌ల్లో సచిన్ ఈ ఘనతను అందుకున్నాడు.

సచిన్ తర్వాత 80 శతకాలతో విరాట్ కోహ్లీ, 71 సెంచరీలతో రికీ పాంటింగ్, కుమార్ సంగక్కర(63), జాక్వెస్ కల్లీస్(62), హషీమ్ ఆమ్లా(55), మహేళ జయవర్దనే(54), బ్రియాన్ లారా(53) జోరూట్ కంటే ముందున్నారు.
టెస్ట్‌ల్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్లలో జోరూట్ ఆరో స్థానంలో ఉన్నాడు. 51 సెంచరీలతో సచిన్ టాప్‌లో ఉండగా... జాక్వస్ కల్లిస్(45), రికీ పాంటింగ్(41), కుమార సంగక్కర(38), రాహుల్ ద్రవిడ్(36) జోరూట్ కన్నా ముందున్నారు. 33 శతకాలతో జోరూట్.. యూనిస్ ఖాన్, సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, జయవర్ధనేలతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. 32 సెంచరీలతో అలిస్టర్ కుక్ ఏడో స్థానంలో ఉన్నాడు.
టెస్ట్‌లో అత్యధిక సెంచరీలు, పరుగుల రికార్డు భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిటే ఉంది. టెస్ట్‌ల్లో 51 సెంచరీలు చేసిన సచిన్.. 15,921 రన్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ నెలకొల్పిన ఈ ఆల్‌టైమ్ రికార్డ్స్‌ను అధిగమించాలంటే జో రూట్ మరో 18 శతకాలతో పాటు 3,544 పరుగులు చేయాలి. 22 ఏళ్ల వయసున్న జోరూట్ మరో నాలుగేళ్ల పాటు ఇదే ఫామ్ కనబరిస్తే.. సునాయసంగా ఈ రికార్డ్స్‌ను అధిగమిస్తాడు.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో జో రూట్ అసాధారణ ప్రదర్శనతో ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్ట్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా సెప్టెంబర్ 6-10 మధ్య జరగనుంది.