World Cup 2023, ENG vs PAK: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు దుమ్మురేపారు. బెన్ స్టోక్స్(76 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84), జో రూట్(72 బంతుల్లో 4 ఫోర్లతో 60), జానీ బెయిర్‌స్టో(61 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది.
హ్యారీస్ రౌఫ్(3/59) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది(2/72), మహమ్మద్ వాసీమ్(2/74) రెండేసి వికెట్లు తీయగా.. ఇఫ్తికర్ అహ్మద్(1/38)కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలవడంతోనే పాకిస్థాన్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు డేవిడ్ మలాన్, జానీ బెయిర్ స్టో అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.

తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం డేవిడ్ మలాన్(31)ను ఇఫ్తికర్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. 52 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన జానీ బెయిర్ స్టోను హ్యారీస్ రౌఫ్ ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్, జోరూట్ అద్భుతంగా ఆడారు. పాక్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది.
53 బంతుల్లో బెన్ స్టోక్స్.. 65 బంతుల్లో జోరూట్ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. 132 పరుగుల భారీ భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని షాహిన్ షా అఫ్రిది విడదీసాడు. బెన్ స్టోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే జోరూట్ కూడా పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ జోస్ బట్లర్(27), హ్యారీ బ్రూక్(30) ధాటిగా ఆడి జట్టు స్కోర్‌ను 300 ధాటించారు.
ధాటిగా ఆడుతున్న హ్యారీ బ్రూక్‌ను హ్యారీస్ రౌఫ్ ఔట్ చేయగా..జోస్ బట్లర్ రనౌటయ్యాడు. మొయిన్ అలీని హ్యారీస్ రౌఫ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ 337 పరుగులకే పరిమితమైంది.