
లండన్: ఇరు జట్ల బౌలర్ల ఆధిపత్యం సాగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ ( 188 బంతుల్లో 11 ఫోర్లతో 97 బ్యాటింగ్), టామ్ బ్లండెల్ (182 బంతుల్లో 12 ఫోర్లతో 90 బ్యాటింగ్) గొప్ప పోరాట పటిమ ప్రదర్శించారు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన న్యూజిలాండ్‌ను మిచెల్, బ్లండెల్ ఆదుకున్నారు.
ఆలౌట్ దిశగా సాగుతున్న కివీస్ ఇన్నింగ్స్‌ను వీళ్లిద్దరూ 180 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో నిలబెట్టారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 79 ఓవర్లలో 4 వికెట్లకు 236 పరుగులు చేసింది. దాంతో రెండో రోజు న్యూజిలాండ్‌దే పై చేయి అయింది. ముందుగా ఆతిథ్య జట్టును ఆలౌట్ చేసిన న్యూజిలాండ్ ఆ తర్వాత మిచెల్, బ్లండెల్ సూపర్ బ్యాటింగ్‌తో మ్యాచ్ చేజారకుండా జాగ్రత్తపడింది.
తొలి రోజు కివీస్ 132 పరుగులకే కుప్పకూలగా.. అదే స్థాయిలో తడబడ్డ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 141 పరుగులకు కుప్పకూలి 9 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. 116/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. సౌథీ (4/55), బౌల్ట్ (3/21) ధాటికి కుప్పకూలింది.
అనంతరం పాట్స్ (2/50), బ్రాడ్ (1/47), అండర్సన్ (1/49)ల ధాటికి కివీస్ మరోసారి కుప్పకూలేలా కనిపించగా.. మిచెల్, బ్లండెల్ కథ మార్చేశారు. ఓపెనర్లు టామ్ లాథమ్(14), విల్ యంగ్(1) మరోసారి విఫలమవ్వగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్(15) సైతం తన పేలవ ప్రదర్శనను కొనసాగించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అరంగేట్ర పేసర్ మాథ్యూ పాట్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 227 పరుగుల ఆధిక్యంలో ఉంది.
సంక్షిప్త స్కోర్లు:
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 132 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 141 ఆలౌట్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 236/4