
నాటింగ్‌హామ్: తొలి టెస్టులో ఓటమి పాలైన న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌తో రెండో మ్యాచ్‌ను మెరుగ్గా ప్రారంభించింది. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో కివీస్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. టాపార్డర్ రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 87 ఓవర్లలో 4 వికెట్లకు 318 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (147 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81 బ్యాటింగ్), టామ్ బ్లండెల్ (136 బంతుల్లో 8 ఫోర్లతో 67 బ్యాటింగ్) అయిదో వికెట్‌కు అజేయంగా 149 పరుగులు జోడించారు. ఓపెనర్లు లేథమ్ (26), యంగ్ (47) తొలి వికెట్‌కు 84 పరుగులు జతచేసి శుభారంభం అందించారు. కాన్వే (46), నికోల్స్ (30) రాణించారు.
వీళ్లను ఔట్ చేసిన ఇంగ్లండ్ బౌలర్లకు మిచెల్, బ్లండెల్‌లను పెవిలియన్ పంపడం సాధ్యం కాలేదు. వీళ్ల భాగస్వామ్యాన్ని విడగొట్టడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోయింది. స్టోక్స్ (2/40), అండర్సన్ (2/42) చెరో రెండు వికెట్లు తీశారు. కరోనా సోకడంతో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయిదు రోజుల పాటు ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. దాంటో టామ్ లాథమ్ ఈ మ్యాచ్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. కాగా, విలియమ్సన్ స్థానంలో హమిష్ రూథర్‌ఫర్డ్ జట్టులోకి వచ్చాడు.
కేన్ విలియమ్సన్‌కు బ్యాడ్ టైమ్ వెంటాడుతోంది. మొన్నటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022, సీజన్ 15వ ఎడిషన్ నుంచీ ఏదీ కలిసి రావట్లేదు. ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నాయకత్వాన్ని వహించిన కేన్.. తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఫామ్ కోల్పోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయాడు. అటు కేప్టెన్‌గా జట్టుకు విజయాలను అందించలేకపోయాడు. చివరి మ్యాచ్ ఆడకుండానే స్వదేశానికి వెళ్లిపోయాడు.
అతని ఫెయిల్యూర్స్.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో ప్రతిష్ఠాత్మక టెస్ట్ సిరీస్‌లోనూ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ తీరు గాడినపడలేదు. క్రీజ్‌లో కుదురుకుని ఆడటానికి అవకాశం ఉన్న టెస్ట్ మ్యాచ్‌లోనూ విఫలం అయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు.. ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేయలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 17 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో అయిదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రెండో టెస్ట్‌కు కరోనా కేన్ మామ దూరం అయ్యాడు.