సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. తొలి టీ20 ఓటమి నుంచి తేరుకొని తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది. కార్డిఫ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20లో లియామ్ లివింగ్‌స్టోన్(47 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87) విధ్వంసంతో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. జేక్ ఫ్రేసర్-మెక్‌గర్క్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ట్రావిస్ హెడ్(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), జోష్ ఇంగ్లీస్(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42) మెరుపులు మెరిపించారు.

ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(2/26), లియామ్ లివింగ్ స్టోన్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. సామ్ కరణ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్‌తో పాటు జాకోబ్ బెతెల్(24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) రాణించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మాథ్యూ షార్ట్(5/22) ఐదు వికెట్లతో సత్తా చాటినా లాభం లేకపోయింది. సీన్ అబాట్(2/32) రెండు వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లతో పాటు బ్యాటింగ్‌లో సత్తా చాటిన లివింగ్ స్టోన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణాయత్మక మూడో టీ20 ఆదివారం రాత్రి జరగనుంది.