టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ డకౌటైన కోహ్లీకి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ లభించింది. కోహ్లీ డకౌట్ అయినా.. ప్రేక్షకులంతా కింగ్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. అడిలైడ్ ఫ్యాన్స్ ఘన వీడ్కోలు పలికారు. ముఖ్యంగా అడిలైడ్ మైదానంతో కోహ్లీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ ఒక్క మైదానంలోనే కోహ్లీ 5 శతకాలు బాదాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ రికార్డ్ సాధించాడు.

అలాంటి కోహ్లీ ఈ వేదికగా ఆడిన ఆఖరి వన్డేలో డక్ ఔటవ్వడం.. ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడంతో భావోద్వేగానికి గురయ్యాడు. తల వంచుకొని.. గ్లోవ్స్ తీసేసి ధన్యవాదాలు చెబుతూ మైదానం వీడాడు. ఈ దృష్యం కోహ్లీ అభిమానులను తీవ్ర బాధకు గురి చేసింది. ఇదే మైదానంలో ఒకప్పుడు రారాజుగా పరుగుల మోత మోగించిన కోహ్లీ.. ఇప్పుడు మౌనంగా నిష్క్రమించడం చూసి వారు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కోహ్లీ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో డక్ ఔటవ్వడంతో కోహ్లీ ఓ చెత్త రికార్డ్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. 17 ఏళ్ల వన్డే క్రికెట్‌లో తొలిసారి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లోనూ కోహ్లీ డక్ ఔట్ అయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 8 బంతులాడిన కోహ్లీ.. తాజా మ్యాచ్‌లో 4 బంతులకే వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న కండిషన్స్‌పై ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తడబడ్డారు. ఆచితూచి ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నారు. 7వ ఓవర్ తొలి బంతికి శుభ్‌మన్ గిల్(9)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన గ్జేవియర్ బార్ట్‌లెట్.. ఐదో బంతికి విరాట్ కోహ్లీని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో 17 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ శర్మ(73) జట్టును ఆదుకున్నాడు. 74 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించాడు.