అతని కాళ్లు మొక్కి టీమిండియా జెర్సీ అందుకున్న బుడ్డోడు! (వీడియో)
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. శుక్రవారం ఐర్లాండ్‌తో ప్రారంభమయ్యే రెండు టీ20ల సిరీస్‌తో వైభవ్ సూర్యవంశీ శకం మొదలవ్వనుంది. ఐర్లాండ్ పర్యటనకు సిద్దమైన వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ.. టీమిండియా జెర్సీని అందజేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంది.
రఘు కాళ్లు మొక్కి..
టీమిండియా జెర్సీని అందుకున్న వైభవ్ సూర్యవంశీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. టీమిండియా కిట్‌ను త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు స్వయంగా సూర్యవంశీకి అందజేశాడు. టీమ్ హోటల్‌లో వైభవ్ సూర్యవంశీ గదికి వెళ్లి మరి కిట్‌ను ఇచ్చాడు.

తన రూమ్ డోర్ ఓపెన్ చేయగానే రఘును చూసిన వైభవ్ సూర్యవంశీ అతని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తర్వాత తన అనభూతిని బీసీసీఐతో పంచుకున్నాడు.
మాటలు రావడం లేదు..
'ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నేను ఏ కల కోసం అయితే తొలి రోజు బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ కోసం మైదానానికి వెళ్లానో అది ఈ రోజు నెరవేరింది. నా క్రికెట్ ప్రయాణంలో అత్యంత పెద్ద అడుగు ఇది. నిజంగా ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది.
ఆ టీ-షర్ట్(టీమిండియా జెర్సీ)ను చూడగానే నా ముఖంలో నవ్వు ఆపుకోలేకపోయాను. కొన్నిసార్లు మనం అస్సలు ఊహించనివి కూడా జరుగుతుంటాయి. అలాంటప్పుడు అది నిజంగా జరిగినప్పుడు ఎలా స్పందించాలో కూడా మనకు అర్థం కాదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది.' అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
జెర్సీ నెంబర్ 3తో..
వైభవ్ సూర్యవంశీ జెర్సీ నెంబర్ 3ని ఎంచుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన తొలి ఆటగాడిగా నిలిచి సచిన్ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తే మరో రికార్డ్ అందుకోనున్నాడు.
13 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ప్రతీ టోర్నీలో సత్తా చాటి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌లో వరల్డ్ క్లాస్ బౌలర్లను చితక్కొట్టడమే కాకుండా రెండు శతకాలు నమోదు చేశాడు. ఇటీవల ముగిసిన సీజన్‌లో 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
శ్రీలంకలో విధ్వంసం..
శ్రీలంక గడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ -ఏ తరఫున వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ.. నాలుగో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి విమర్శకుల నోరు మూయించాడు. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన వైభవ్.. 29 బంతుల్లో 94 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సత్తా చాటేందుకు సిద్దమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

