ఎమర్జింగ్ ఆసియా కప్ 2025 టోర్నీకి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. నవంబర్ 14 నుంచి 23 మధ్య ఖతర్, దోహా వేదికగా ఈ టోర్నీ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఏసీసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈ ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీని ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ఛాంపియన్‌షిప్‌గా మార్చినట్లు తెలుస్తోంది.
ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక ఏ జట్లతో పాటు అసోసియేట్ దేశాలైనా ఒమన్, యూఏఈ, హాంగ్ కాంగ్ కూడా బరిలోకి దిగనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో పాల్గొనే దేశాలను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, ఒమన్, యూఏఈ ఉండగా.. గ్రూప్-బీలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంగ్ కాంగ్ ఉన్నాయి.

రెండు గ్రూప్‌ల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ ఆడనున్నాయి. సెమీఫైనల్స్‌లో గెలిచిన జట్లు టైటిల్ పోరులో పాల్గొననున్నాయి. ఈ టోర్నీలో భాగంగా దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్‌లు మరోసారి తలపడబోతున్నాయి. మహిళల వన్డే ప్రపంచకప్, పురుషుల ఆసియా కప్‌లో దాయాదీ దేశాలు తలపడగా.. భారత్‌నే విజయం వరించింది.
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను భారత్ మూడు సార్లు ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో హర్మన్‌సేన ఏకపక్ష విజయాన్నందుకుంది. ఇప్పుడు కుర్రాళ్లు వంతు వచ్చింది. అంతా అనుకున్నట్లు జరిగితే నవంబర్ 16న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
నవంబర్ 21న సెమీఫైనల్స్, నవంబర్ 23న ఫైనల్ జరగనుంది. ఈ టోర్నీలో భారత టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, ప్రియాన్ష్ ఆర్య బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీ కూడా ఏసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న పీసీబీ ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ నేతృత్వంలోనే జరగనుంది. దాంతో భారత్-ఏ జట్టు ఈ టోర్నీ ఆడుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది. ఆసియా కప్ 2025లో విజేతగా నిలిచిన భారత్.. మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ స్వీకరించేందుకు నిరాకరించింది.
ఆ టైటిల్ ఇంకా అతని వద్దే ఉంది. ఈ క్రమంలోనే ఏసీసీతో బీసీసీఐకి విభేదాలు ఏర్పడ్డాయి. దాంతో ఆసియా ఎమర్జింగ్ టోర్నీలో భారత్ బరిలోకి దిగుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది. భారత్ లేకుండా ఈ టోర్నీని నిర్వహించే ధైర్యం ఏసీసీకి లేదు. ఒకవేళ టోర్నీలో భారత్ గెలిస్తే టైటిల్ ప్రదానం మరోసారి చర్చనీయాంశం కానుంది.