ICC Women's T20 World Cup: సెమీస్ ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్

సిడ్నీ: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో సెమీస్ మ్యాచ్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ తొడ కండరాల గాయంతో మెగాటోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. న్యూజిలాండ్‌తో సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 4 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే.
సౌతాఫ్రికా టూర్‌కు కూడా..
అయితే ఈ మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్రీ కుడి తొడ కండరాలకు గాయమైంది. దీంతో ఆమె ఈ మెగాటోర్నీలో మిగిలిన మ్యాచ్‌లతో పాటు.. ఈ నెల చివర్లో ప్రారంభంకానున్న సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యే అవకాశం ఉందని టీమ్ డాక్టర్ పిప్ ఇంగ్ మీడియాకు తెలిపారు.
'ఎల్లిస్ హై గ్రేడ్ కుడి తొడ కండరాల గాయంతో బాధపడుతుంది. దీంతో ఆమె కొంత కాలం ఆటకు దూరం కానుంది. ఆమె త్వరగా కోలుకోవడానికి మేం కృషి చేస్తున్నాం.'అని టీమ్ డాక్డర్ తెలిపారు.

ఎల్లీస్ పెర్రీ కీలక ప్లేయర్..
ఎల్లిస్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని, కోచ్ మథ్యూ మోట్ అభిప్రాయపడింది.‘జట్టులో ఎల్లిస్ కీలక ప్లేయర్. ఆమె గాయంతో అర్ధాంతరంగా దూరమవ్వడం బాధగా ఉంది. తన బ్యాటింగ్, బౌలింగ్‌తో జట్టుకు అవసరమైనప్పుడల్లా రాణిస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషించింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కూడా ఎల్లిస్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆమె జట్టుకు దూరమవ్వడం తీరనే లోటే. కానీ ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు మా జట్టు సిద్ధంగా ఉంది. ఆమె స్థానంలో ఎవరు వస్తారో వారికి మా పూర్తి సహకారం ఉంటుంది' అని మథ్యూ మోట్ చెప్పుకొచ్చింది.

21 పరుగులు..
సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్రీ (15 బంతుల్లో 2 ఫోర్లు 21) రాణించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. బెత్ మూనీ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. చివర్లో రాచెల్ హెనెస్ (8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 19 నాటౌట్) మెరుపులు మెరిపించింది. ప్రత్యర్థి బౌలర్లలో అన్నా పీటర్సన్ రెండు వికెట్లు తీయగా.. అమెలియా కెర్, లై కాస్సెరెక్, జెన్సెన్ తలో వికెట్ తీశారు. అనంతరం 156 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఈ గెలుపుతో గ్రూప్-ఎలో మూడు విజయాలతో సెమీస్ బెర్త్ దక్కించుకుంది. ఇక వరుస విజయాలతో గ్రూప్-'ఎ' టాపర్‌గా ఇప్పటికే భారత్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే.

సెమీస్ ప్రత్యర్థులు తేలేది నేడే..
ఇక గ్రూప్-బి నుంచి 'హ్యాట్రిక్' విజయంతో సౌతాఫ్రికా... మూడో గెలుపుతో ఇంగ్లండ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఇంగ్లండ్ ఈ గ్రూప్‌లో టాప్ ర్యాంక్‌లో ఉన్నప్పటికీ.. మంగళవారం వెస్టిండీస్-సౌతాఫ్రికా మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్‌తో గ్రూప్ టాపర్ ఎవరో తేలనుంది. వెస్టిండీస్‌ను సఫారీలు ఓడిస్తే గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలవనున్నారు. అప్పుడు భారత్ సెమీస్ ప్రత్యర్థి ఇంగ్లండ్ కాగా.. సఫారీలతో ఆసీస్ ఆడనుంది. సౌతాఫ్రికా ఓడితే మాత్రం హర్మన్ ప్రీత్ సేన సౌతాఫ్రికాను, ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా ఢీకొట్టనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications