అనధికారిక ప్రసారాలు, అన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడిన అక్రమ బెట్టింగ్ ఫ్లాట్‌ఫామ్ ఫెయిర్ ప్లే సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. మంగళవారం ముంబైతో పాటు గుజరాత్‌లోని కచ్‌లోని ఎనిమిది ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి రూ. 4 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి అక్రమ బెట్టింగ్‌లతో పాటు అనధికారిక ప్రసారాలు చేస్తుందని ఫెయిర్ ప్లే సంస్థపై జియోసినిమా మాతృసంస్థ అయిన వయాకామ్ 18 మీడియా ప్రేవేట్ లిమిటెడ్ ముంబైలోని నోడల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫెయిర్ ప్లే చేసిన పనివల్ల తమకు రూ. 100 కోట్ల నష్టం వాటిల్లిందని వయాకామ్ 18 తమ ఫిర్యాదులో పేర్కొంది.

ఫెయిర్ ప్లే స్పోర్ట్స్ సంస్థ ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) 1860, ఐటీ చట్టం 2000తో పాటు కాపీ రైట్ చట్టం 1957లను ఉల్లంఘించిందని వయాకామ్ 18 ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ.. సోదాలు నిర్వహించి మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 ప్రకారం సుమారు రూ.4 కోట్ల విలువైన నగదు, బ్యాంకు నిధుల పాటు చరాస్తులను స్వాధీనం చేసుకుంది.
అంతేకాకుండా వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలు, స్థిరాస్థులకు సంబంధించిన పత్రాలను కూడా జప్తు చేసింది. ఫెయిర్ ప్లే సంస్థలో కీలక వ్యక్తి అయిన క్రిష్ లక్ష్మీ చంద్ షా దుబాయ్‌తో పాటు విదేశాల్లో పలు కంపెనీలను రిజిస్టర్ చేసినట్లు ఈడీ తమ దర్యాప్తులో గుర్తించింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే మూడు రౌండ్లు సోదాలు నిర్వహించిన ఈడీ.. తాజాగా నాలుగో సారి దాడులు చేసింది. జూన్ 12, ఆగస్ట్ 27, సెప్టెంబర్ 27 తేదీల్లో సోదాలు నిర్వహించిన ఈడీ సుమారు రూ. 113 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం రూ. 117 కోట్లను స్వాధీనం చేసుకుంది.
ఫెయిర్ ప్లే ఆర్థిక లావాదేవీల చిట్టాను విప్పడం, అక్రమ బెట్టింగ్, ప్రసారా కార్యకలాపాల లబ్దిదారులను గుర్తించడమే లక్ష్యంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. క్రికెట్ సీజన్ జోరుగా సాగుతున్న తరుణంలో అక్రమార్కులపై ఈడీ ఉక్కుపాదం మోపడం బెట్టింగ్ రాయుళ్లకు ఓ హెచ్చరికగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.