India vs England టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మార్చమని బీసీసీఐ కోరలేదు.. అవన్నీ గాలివార్తలే: ఈసీబీ

లండన్: కరోనాతో అర్దంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణ కోసం భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో మార్పులు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమతో సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న వార్తలను ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఖండించింది. ఇవన్నీ గాలి వార్తలేనని కొట్టిపారేసింది. టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి రిక్వెస్ట్ రాలేదని స్పష్టం చేసింది.
ఐపీఎల్-2021ను ఎలాగైనా పూర్తి చేయాలని భావిస్తున్న బీసీసీఐ.. అందుకోసం భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని... ఒక్కో టెస్టు షెడ్యూల్‌లో మార్పు చేసి కనీసం వారం ముందుగా సిరీస్ ముగించాలని ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ)కి విజ్ఞప్తి చేసిందని ప్రచారం జరిగింది.

మాజీ క్రికెటర్ ప్రకటనతో..
ఆగస్టు 4న మొదలయ్యే సిరీస్ సెప్టెంబర్ 14న ముగుస్తుంది. దీనిని కనీసం సెప్టెంబర్ 7 వరకు ముగించాలని బీసీసీఐ కోరుతోందనే వార్తలు వెలువడ్డాయి. అలా చేస్తే కనీసం మూడు వారాల సమయం తమకు దొరుకుందని... అవసరమైతే రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున నిర్వహించైనా ఐపీఎల్‌లోని మిగిలిన 31 మ్యాచ్‌లను పూర్తి చేయవచ్చని భారత బోర్డు భావిస్తోందనేది ఆ వార్తల సారంశం. ఈ వార్తలను ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మైక్ అథర్టన్ కూడా ధృవీకరించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది.

అవన్నీ పుకార్లే..
ఈ ప్రచారంపై ఈసీబీ స్పందించింది. భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి రిక్వెస్ట్ రాలేదని ఈసీబీ అధికార ప్రతినిధి క్రిక్‌బజ్‌కు తెలిపారు. 'బీసీసీఐతో తరుచూ మేం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. కరోనా వైరస్ సవాళ్లను అధిగమిస్తూ ఎలా ముందుకు సాగాలనేదాని సుదీర్ఘంగా చర్చిస్తున్నాం. అయితే టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని ఇప్పటి వరకు బీసీసీఐ తమను కోరలేదు. అసలు ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రస్తావనే రాలేదు'అని చెప్పుకొచ్చారు.

యూకేలో సెకండాఫ్..
ఐపీఎల్ -14లో మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణకు యూకే ఫస్ట్ చాయిస్ వేదికగా బీసీసీఐ భావిస్తోంది. 'టెస్ట్ సిరీస్‌లో మార్పులు చేయడానికి ఈసీబీ అంగీకరిస్తే మాత్రం ఐపీఎల్ తమ దేశంలోనే జరగాలని ఇంగ్లండ్ కోరుకుంటుంది. ఎందుకంటే లీగ్ వల్ల ఆ దేశానికి ఆదాయం వస్తుంది. దీనివల్ల ఇరు బోర్డులకు ప్రయోజనం ఉంటుంది. ఏదేమైనా ఐపీఎల్‌ను పూర్తి చేయడం బీసీసీఐ తొలి ప్రాధాన్యత కానుంది. దీనిపై వాటాదారులందరినీ ఏకాభిప్రాయానికి తీసుకొచ్చింది. కాబట్టి 14వ సీజన్‌ను పూర్తి చేసే విషయంలో అనుమానమే అవసరం లేదు'అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.

యూకేలో అసాధ్యం..
జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ టీమిండియా అక్కడే ఉండటంతో పాటు.. ఇతర దేశాల ప్లేయర్లను యూకే తీసుకురావడం కూడా సులభమని బీసీసీఐ భావిస్తుంది. బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ కూడా సానుకూలంగా ఉంది. పైగా అక్కడి గవర్నమెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం ఫ్యాన్స్‌ను అనుమతిస్తోంది. ఫ్రాంచైజీలకు గేట్ రెవెన్యూ (టిక్కెట్ల డబ్బు) వస్తుంది కాబట్టి ఖర్చులను మేనేజ్ చేసుకోవచ్చ అని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇది సాధ్యమయ్యే అవకాశాలు తక్కువ! ఐదు టెస్టులకు సంబంధించి ఆయా తేదీల ప్రకారం దాదాపు అన్ని టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. పైగా హోటల్ వసతి, బయో బబుల్, టీవీ ప్రసారపు ఏర్పాట్లు కొత్తగా చేయాల్సి రావడంతో పాటు ఈసీబీ తమ కౌంటీ జట్లను కూడా ఒప్పించాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications