సొంతగడ్డపై భారత్ ఇచ్చిన షాక్ నుంచి ఇంగ్లండ్ కోలుకోలేకపోతుంది. ఐదు టెస్ట్‌ల అండర్సన్- సచిన్ ట్రోఫీలో అసాధారణ ప్రదర్శన కనబర్చిన భారత్ 2-2తో సమం చేసుకుంది. ఈ సిరీస్ అసాంతం అసాధారణ ప్రదర్శన కనబర్చిన భారత్.. ఇంగ్లండ్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ ఫలితం కారణంగా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఇంగ్లండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. మరోవైపు భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
అయితే డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్‌ను డబుల్ టైర్ విధానంలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వ్యతిరేకిస్తుంది. టూ టైర్ విధానంలో ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తే.. ఇంగ్లండ్ తక్కువ స్థాయి దేశాలతో మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. టాప్ పెర్ఫామెన్స్ కనబర్చే భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టాప్ గ్రూప్‌లో ఉంటే.. ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్ జట్లతో ఇంగ్లండ్ రెండో గ్రూప్‌లో ఆడాల్సి ఉంటుంది.

అదే జరిగితే తక్కువ స్థాయి జట్లతో ఆడటం వల్ల ఇంగ్లండ్ రెవెన్యూపై దెబ్బపడుతుంది. ఈ క్రమంలోనే ఈ టూ టైర్ వ్యవస్థను ఈసీబీ వ్యతిరేకిస్తోంది. ఈ విధానానికి తాము వ్యతిరేకమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ స్పష్టం చేశారు. భారత్, ఆస్ట్రేలియాతో ఆడకుంటే ఇంగ్లండ్ ఆదాయం దెబ్బతింటుంది. ముఖ్యంగా యాషెస్ సిరీస్ ఆడలేకపోతే.. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుతుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తొలి రెండు ఎడిషన్స్‌లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కనబర్చింది. తొలి ఎడిషన్(2019-21)లో నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్.. రెండో ఎడిషన్(2021-23)లో కూడా నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. (2023-25) ఎడిషన్‌లోనూ ఫైనల్ చేరలేకపోయింది. బాజ్ బాల్ అప్రోచ్ ఇంగ్లండ్ కొంపముంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అప్రోచ్‌తో ఇంగ్లండ్ కొన్ని అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ ఆశించిన ఫలితాలు దక్కలేదు.