
దుబాయ్: వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచే తన కెరీర్‌లో చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అని ప్రకటించాడు. శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన వెస్టిండీస్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరమే బ్రావో తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. 'సమయం ఆసన్నమైందని అనిపిస్తోంది. వెస్టిండీస్‌కు 18 ఏళ్ల పాటు ప్రాతినిథ్యం వహించాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను.
అయితే, వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించాను. కరేబియన్ ప్రజల తరఫున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించడం పట్ల కృతజ్ఞతాభావంతో నా మనసు నిండిపోయింది. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన విండీస్ జట్టులో సభ్యుడిని కావడం సంతోషకరం. ఈ ప్రపంచకప్‌లో తమ జట్టు వైఫల్యాలకు తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో మేం ఇలా విఫలమవుతాం అనుకోలేదు. టోర్నీలో టఫ్ కాంపిటేషన్ ఉంది.'అని ఐసీసీ పోస్ట్ మ్యాచ్ షోలో బ్రావో వ్యాఖ్యానించాడు.
2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన బ్రావో... వెస్టిండీస్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 293 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 2006లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన బ్రావో.. ఇప్పటివరకు 90 టీ20 మ్యాచ్‌లు ఆడి 1000 పరుగులతో పాటు 78 వికెట్లు పడగొట్టాడు. 2012, 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జట్టులో అతను కీలక ఆటగాడు. ముఖ్యంగా 2012 టోర్నీలో విన్నింగ్ క్యాచ్ అందుకుని జట్టును విజయతీరాలకు చేర్చిన తీరును ఎవరూ మర్చిపోలేరు. ఇక టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో నవంబరు 6న జరగనున్న మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కితే విండీస్ తరఫున బ్రావోకు ఇదే చివరి మ్యాచ్ అవుతుంది.
వాస్తవానికి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించి ఏడాది దాటిన తర్వాత బ్రావో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. టీ20 ఫార్మాట్ సెలక్షన్స్‌కు అందుబాటులో ఉండేందుకే తాను యూటర్న్ తీసుకున్నట్లు 2019లో వెల్లడించాడు. అప్పట్లో బోర్డు పెద్దల వ్యవహారం సరిగ్గా లేనందు వల్లే రిటైర్మెంట్ ఆలోచన చేశానన్న బ్రావో... ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో విండీస్ తరఫున చివరిసారిగా బరిలోకి దిగి టైటిల్ అందించి గౌరవంగా తప్పుకోవాలని భావించాడు. కానీ టోర్నీ ఆ జట్టు పేలవ ఆటతీరు కనబర్చడంతో లీగ్ దశలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బ్రావో.. ఫ్రాంచైజీ క్రికెట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంకొన్నాళ్లు అతను టీ20 లీగ్స్‌ను ఆస్వాదించే చాన్స్ ఉంది.