హైదరాబాద్: వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్లు, ఫ్రాంచైజీ క్రికెట్ సూపర్ స్టార్లు డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్ద కాలంగా ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోంది. ఒకే జట్టు తరఫున ఆడినా.. ప్రత్యర్థులుగా తలపడినా ఈ ఇద్దరూ తమ చర్యలతో సహచర ఆటగాళ్లను, అభిమానుల అలరిస్తూనే ఉంటారు.
అంత స్నేహంగా ఉన్న ఈ ఇద్దరూ తాజాగా గొడవ పడ్డారు. ఐపీఎల్ 2022 సీజన్ వరకు ప్లేయర్లుగా కొనసాగిన ఈ ఇద్దరూ ఇప్పుడు కోచ్‌లుగా అవతారమెత్తారు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్ కొనసాగుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా డ్వేన్ బ్రావో సేవలందిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ విజయాన్ని ప్రస్తావిస్తూ బ్రావో.. తన చిరకాల మిత్రుడు కీరన్ పొలార్డ్‌ను ఆటపట్టించాడు. ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ టీమ్ తమదేనని, ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచామని తెలిపాడు. అంతేగాకుండా కోచ్‌గా తొలి టైటిల్ అందుకున్నానని పోలార్డ్‌ను టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియోను బ్రావో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
బ్రావో మాటలతో పొలార్డ్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఎవరు ఎక్కువ టైటిల్స్ గెలిచారో చూసుకుందామా? అన్నాడు. వెంటనే బ్రావో.. పోలార్డ్ కంటే తానే ఎక్కువ టైటిళ్లు గెలిచానని చెప్పాడు. ఆ వెంటనే ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్సేనని, తమ జట్టు రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిస్తే.. ముంబై ఒక్కటే గెలిచిందని గుర్తు చేశాడు. బ్రావోతో పోలార్డ్ వాదించలేకపోయాడు.
ఈ వీడియోకు బ్రావో తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చాడు. 'ఎవరైనా ఈ డిబెట్ ముగిసేలా సహాయం చేయండి. పొలార్డ్ తన జట్టే మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ టీమ్ అని భావిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తోపు అనే రికార్డు కొంచెం పొలార్డ్‌కు చూపించండి. మేం గెలిచిన ట్రోఫీల లెక్క గురించి కూడా పొలార్డ్ మాట్లాడుతున్నాడు.
నేను మొత్తం 17 టైటిళ్లు గెలిస్తే.. పోలార్డ్ 15 ట్రోఫీలే గెలిచాడు. ఈ విషయాలన్ని తెలుసుకొని కాస్త నాకు గౌరవం ఇవ్వండి. ధన్యవాదాలు'అంటూ బ్రావో చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ చేరిన అనంతరం తమకు ప్రత్యర్థిగా ముంబై ఇండియన్స్ రావద్దని బ్రావో తెలిపాడు. ముంబై ఫైనల్‌కు వస్తే తాము గెలవలేమని, అప్పుడు పొలార్డ్‌ను తట్టుకోవడం కష్టమని పేర్కొన్నాడు.
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు సార్లు విజేతలుగా నిలిచాయి. అయితే ఛాంపియన్స్ లీగ్‌లో మాత్రం చెన్నై రెండు సార్లు నెగ్గగా.. ముంబై ఒకేసారి గెలుపొందింది.