ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ 2025లో రజత్ పటీదార్ సారథ్యంలోని సెంట్రల్ జోన్ విజేతగా నిలిచింది. బెంగళూరు వేదికగా జరిగిన ఫైనల్లో సౌత్ జోన్ 6 వికెట్లతో సౌత్ జోన్‌పై గెలుపొందింది. సౌత్ జోన్ నిర్దేశించిన 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో రజత్ పటీదార్ కెప్టెన్‌గా వరుసగా రెండు టైటిళ్లను ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో రజత్ పటీదార్ సారథ్యంలోని ఆర్‌సీబీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్(76 బంతుల్లో 3 ఫోర్లతో 31), సల్మాన్ నిజర్(24)లు మాత్రమే టాప్ స్కోరర్లుగా నిలిచారు. సెంట్రల్ జోన్ బౌలర్లలో సరన్ష్ జైన్(5/49), కుమార్ కార్తీకేయ(4/53) సౌత్ జోన్ పతనాన్ని శాసించారు.

అనంతరం సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్(115 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101), యష్ రాథోడ్(286 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లతో 194) శతకాలతో చెలరేగగా.. డానిష్ మలెవర్(120 బంతుల్లో 5 ఫోర్లతో 53), సరన్ష్ జైన్(193 బంతుల్లో 7 ఫోర్లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌత్ జోన్ బౌలర్లలో గుర్జప్‌నీత్ సింగ్(4/124), అంకిత్ శర్మ(4/180) నాలుగేసి వికెట్లు తీయగా.. నిదీష్, వాసుకి కౌశిక్ చెరో వికెట్ పడగొట్టారు.
భారీ పరుగల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ 426 పరుగులే చేసింది. అంకిత్ శర్మ(168 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 99),అండ్రీ సిద్దార్థ్(190 బంతుల్లో 7 ఫోర్లతో 84 నాటౌట్) తృటిలో శతకం చేజార్చుకోగా.. రవిచంద్రన్ స్మరణ్(118 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 67) హాఫ్ సెంచరీతో రాణించాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో కుమార కార్తీకేయ(4/110) మరోసారి నాలుగు వికెట్లు తీయగా.. సరన్ష్ జైన్(3/130) మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ సేన్, దీపక్ చాహర్‌కు చెరో వికెట్ దక్కింది.
66 పరుగుల లక్ష్యఛేదనను సెంట్రల్ జోన్ 20.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. అక్షయ్ వాడ్కర్(19 నాటౌట్) రాణించాడు. సౌత్ జోన్ బౌలర్లలో గుర్జప్‌నీత్ సింగ్, అంకిత్ శర్మ రెండేసి వికెట్లు తీసారు. యష్ రాథోడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సరన్ష్ జైన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది.
