ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024లో ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్(227 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 బ్యాటింగ్) అజేయ శతకంతో చెలరేగాడు. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా-బీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్ ఖాన్.. బెంగళూరు వేదికగా ఇండియా-ఏతో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో దుమ్మురేపాడు.
ముషీర్ ఖాన్ ఫైటింగ్ సెంచరీకి అతని సోదరుడు, టీమిండియా స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎగిరి గంతేసాడు. తమ్ముడు సెంచరీ మార్క్ అందుకున్న క్షణాన గ్యాలరీలో అన్న సంబరాలు చేసుకున్నాడు. మైదానంలో ముషీర్ ఖాన్.. గాల్లోకి ఎగిరి పంచ్‌లు ఇస్తూ సెంచరీ సెలెబ్రేషన్స్ చేసుకోగా.. డ్రెస్సింగ్ రూమ్ గ్యాలరీలో సర్ఫరాజ్ ఖాన్ గట్టిగా అరుస్తూ.. తమ్ముడిని అభినందించాడు.

సర్ఫరాజ్ ఖన్ సంబరం..
అతనితో పాటు జట్టు మొత్తం ముషీర్ ఖాన్ ఫైటింగ్ సెంచరీకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. చప్పట్లతో ప్రత్యేకంగా అభినందించింది. ప్రత్యర్థి టీమ్ ఇండియా ఏ ఆటగాళ్లు సైతం ముషీర్ ఖాన్ పోరాట పటిమను మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఏ సోదరుడికి ఇంత కన్నా ఆనందమైన క్షణం ఉండదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. దులీప్ ట్రోఫీ 2024లో ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ ఇండియా బీ జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగులే చేసి ఎల్బీగా వెనుదిరగ్గా.. తమ్ముడు ముషీర్ ఖాన్ మాత్రం శతకంతో అదరగొట్టాడు.
94 పరుగులకే 7 వికెట్లు..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-బీ 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పిచ్ నుంచి లభించిన సహకారంతో ఇండియా-ఏ పేసర్లు నిప్పులు చెరగగా.. ఇండియా బీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(59 బంతుల్లో 30), అభిమన్యు ఈశ్వరన్(42 బంతుల్లో 13) కాస్త ఓపికగా బ్యాటింగ్ చేయగా.. సర్ఫరాజ్ ఖాన్(9), రిషభ్ పంత్(7), నితీష్ కుమార్ రెడ్డి(0), వాష్టింగన్ సుందర్(0), సాయి కిషోర్(1) దారుణంగా విఫలమయ్యారు.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన టెయిలండర్ నవ్‌దీప్ సైనీ(74 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 28 బ్యాటింగ్) సాయంతో ముషీర్ ఖాన్ జట్టును ఆదుకున్నాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించాడు. ప్రస్తుతం 108 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఈ జోడీ క్రీజులో ఉంది.
7 మ్యాచ్‌లు.. 4 శతకాలు
పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో డిఫెన్స్‌కు పరిమితమైన ముషీర్ ఖాన్.. తన అసలు సిసలు క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముందుగా 118 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను.. 205 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 10 ఫోర్లతో పాటు 2 సిక్స్‌లు బాదాడు. దాంతో ఇండియా బీ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులు చేసింది.
ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీసారు. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడైన ముషీర్ ఖాన్.. దేశవాళీ క్రికెట్‌లో గతకొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటికే ముంబై తరఫున రంజీ క్రికెట్‌లో 19 ఏళ్ల ముషీర్ ఖాన్ సెంచరీల మోత మోగించాడు. ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో అతనికి ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.