టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-ఏకు ప్రాతినిథ్యం వహిస్తున్న ధ్రువ్ జురెల్.. ఇండియా-బీతో జరుగుతున్న మ్యాచ్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. అచ్చం దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీలానే వికెట్ల వెనుకాలా సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు.
రెప్పపాటు సమయంలోనే రియాక్ట్ అయిన ధ్రువ్ జురెల్.. చేప పిల్లలానే డైవ్ చేసాడు. అతని సూపర్ క్యాచ్‌కు ఇండియా-బీ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ పెవిలియన్ చేరాడు. ఇండియా-ఏ బౌలర్ ఆవేశ్ ఖాన్ వేసిన 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని ఆవేశ్ ఖాన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా..అభిమన్యు ఈశ్వరన్ గట్టిగా ఆడే ప్రయత్నం చేసాడు.

కానీ బంతి అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ కుడి వైపు దూసుకెళ్లింది. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడానికి గమనించిన ధ్రువ్ జురెల్ అంతే వేగంతో కుడివైపు డైవ్ చేసి బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు బిత్తరపోయిన అభిమన్యు ఈశ్వరన్.. నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు జూనియర్ ధోనీ అంటూ ధ్రువ్ జురెల్‌ను కొనియాడుతున్నారు. అతని వికెట్ కీపింగ్ అచ్చం ధోనీలానే ఉందని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా బీ జట్టు 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పిచ్ నుంచి లభించిన సహకారంతో ఇండియా-ఏ పేసర్లు నిప్పులు చెరగగా.. ఇండియా బీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్(59 బంతుల్లో 30), అభిమన్యు ఈశ్వర్(42 బంతుల్లో 13) కాస్త ఓపికగా బ్యాటింగ్ చేయగా.. సర్ఫరాజ్ ఖాన్(9), రిషభ్ పంత్(7), నితీష్ కుమార్ రెడ్డి(0), వాష్టింగన్ సుందర్(0), సాయి కిషోర్(1) దారుణంగా విఫలమయ్యారు.
ముషీర్ ఖాన్(96 బంతుల్లో 31 బ్యాటింగ్).. నవ్‌దీప్ సైనీతో(1 బ్యాటింగ్) కలిసి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీసారు.
Flying Jurel pic.twitter.com/IKfEZ3BBgC
— psyf (@PsyfeR888) September 5, 2024