టీమిండియా జెర్సీ స్పాన్సర్ డ్రీమ్ 11తో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. భారత ప్రభుత్వం కొత్తగా ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి సంస్థలతో సంబంధాలు కొనసాగించబోమని బీసీసీఐ సెక్రటరీ దెవాజిత్ సైకియా స్పష్టం చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు రాకతో డ్రీమ్ 11 తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది.
జెర్సీ స్పాన్సర్‌గా కొనసాగలేమని ఇప్పటికే బీసీసీఐ డ్రీమ్ 11 సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా మూడేళ్ల కాలానికి బీసీసీఐతో డ్రీమ్ 11 రూ.358 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. కానీ మధ్యలోనే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చట్టపరమైన కారణాలతోనే స్పాన్సర్‌షిప్ డీల్‌ను రద్దు చేసుకోవడంతో బీసీసీఐ ఎలాంటి జరిమానా విధించలేదు. ఐపీఎల్‌లో కూడా పలు జట్లకు డ్రీమ్ 11 స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆ ఒప్పందాలను కూడా రద్దు చేసుకోనుంది.

ఆసియా కప్ 2025 ముందే బీసీసీఐ.. డ్రీమ్ 11తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొత్త స్పాన్సర్‌ను వెతుక్కునే పనిలో బీసీసీఐ పడింది. అందుకోసం త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుంది. అయితే డ్రీమ్ 11 కంటే ముందు టీమిండియాకు బైజూస్, ఒప్పో, స్టార్, సహారా సంస్థలు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించాయి. అయితే ఈ కంపెనీలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దాంతో టీమిండియాకు స్పాన్సర్స్ చేస్తే కంపెనీలు మూసుకోవాల్సిందే అనే చర్చ మొదలైంది. బీసీసీఐ టెండర్లకు పిలిచినా పెద్దగా స్పందన ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందే బీసీసీఐ జెర్సీ స్పాన్సర్‌ను తీసుకురావాల్సి ఉంది. బిజినెస్ వర్గాల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన CAMPA జెర్సీ స్పాన్సర్ కోసం పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
1970, 80లలో భారతదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ అనే భారతీయ కంపెనీ.. కోకా-కోలా, పెప్సీ పోటీని తట్టుకోలేకపోయింది. ఈ కంపెనీని 2022లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసి తిరిగి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే CAMPA ఐపీఎల్‌లో పలు జట్లకు స్పాన్సర్ చేస్తోంది. భారత క్రికెట్ స్టేడియాల్లో CAMPA డ్రింక్స్ మాత్రమే అమ్మెలా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. పెప్సీ, కొకాకోలాను అధిగమించాలనే లక్ష్యంతో CAMPA ఉంది. ఇప్పటికే అతి తక్కువ ధరలకు ఈ డ్రింక్స్‌ను అందిస్తోంది. టీమిండియా జెర్సీ స్పాన్సర్ చేస్తే దేశవ్యాప్తంగా మరింత మంది ఆకట్టుకోవచ్చనే ఆలోచనలో CAMPA ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే జెర్సీ స్పాన్సర్ టెండర్ ప్రక్రియాలో CAMPAకు టాటా గ్రూప్, అదానీ గ్రూప్, మహింద్రా గ్రూప్ నుంచి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిన్‌టెక్ కంపెనీలు జెరోదా, ఏంజెల్ వన్, గ్రో సంస్థలు కూడా జెర్సీ స్పాన్సర్ రైట్స్ కోసం పోటీ పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆటోమొబైల్, ఎఫ్‌ఎమ్‌సీజీ కేటగిరీల్లోని మహింద్రా, టయోటాతో పాటు పెప్సీ కూడా పోటీ పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.