ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్) 2025 తుది దశకు చేరుకుంది. దాంతో మ్యాచ్‌లు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. విజయమే లక్ష్యంగా ఆటగాళ్లు బరిలోకి దిగుతుండటంతో ఘర్షణ వాతావారణం నెలకొంటుంది. తాజాగా వెస్ట్ ఢిల్లీ లయన్స్, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న నిర్వాహకులు ఇరు జట్లలోని మొత్తం ఐదుగురు ఆటగాళ్లకు భారీ జరిమానా విధించారు.
శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. అనంతరం వెస్ట్ ఢిల్లీ స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయింది. నితీశ్ రాణా(55 బంతుల్లో 8 ఫోర్లు, 15 సిక్స్‌లతో 134 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. ఓపెనర్ క్రిష్ యాదవ్(31), మయాంక్ గుసైన్(15 నాటౌట్)ల సహకారంతో వెస్ట్ ఢిల్లీని గెలిపించాడు. నితీష్ ధాటికి వెస్ట్ ఢిల్లీ 17.1 ఓవర్లలో మూడు వికెట్లకు 202 పరుగులు చేసింది. క్రిష్-నితీష్ మూడో వికెట్‌కు 98 పరుగులు జోడించారు.

ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సౌత్ ఢిల్లీ బౌలర్ భార్తి విడదీసాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతిని ఊరించేలా వేయగా.. క్రిష్ యాదవ్ భారీ సిక్స్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్‌పై క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో బౌలర్ సంబరాలు చేసుకోగా.. బ్యాటర్ అసహనానికి గురయ్యాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డగౌట్‌కు వెళ్తూ క్రిష్ యాదవ్ నోటికి పనిచెప్పడంతో మళ్లీ వాతావరణం వేడెక్కింది. సౌత్ ఢిల్లీ ప్లేయర్ సుమిత్ మాథూర్ అసహనం వ్యక్తం చేస్తూ క్రిష్ యాదవ్ వైపు దూసుకొచ్చాడు. అక్కడే ఉన్న నితీష్ రాణా జోక్యం చేసుకొని అతన్ని వెనక్కిలాగాడు. మరోవైపు మహిళా అంపైర్.. బ్యాటర్‌ను బయటకు వెళ్లాలని నెట్టింది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆటగాళ్లు కొట్టుకునేలా కనిపించారు.
అంతకుముందు దిగ్వేష్ రతి, నితీష్ రాణాల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు నోరు పారేసుకున్నారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దేశవాళీ టోర్నీల్లో గొడవలు ఏంటని నెటిజన్లు మండిపడ్డారు. ప్రతిభను చాటుకునేందుకు నిర్వహించే టోర్నీల్లో క్రీడా స్ఫూర్తి పాటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
గొడవకు కారణమైన క్రిష్ యాదవ్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించగా.. దిగ్వేష్ రతి మ్యాచ్ ఫీజులో 80 శాతం, నితీష్ రాణా మ్యాచ్ ఫీజులో 50 శాతం, అమన్ భర్తీకి 30 శాతం, సుమిత్ మాదుర్ 50 శాతం కోత విధిస్తూ డీపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు.