
డబ్లిన్: ఐర్లాండ్ దేశవాళీ క్రికెట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అనూహ్యంగా మైదానంలోకి దూసుకొచ్చిన ఓ బుజ్జి కుక్క బంతిని ఎత్తుకెళ్లి ఫీల్డర్లను మైదానమంతా పరుగులు పెట్టించింది. కుక్క చేసిన పనితో అటు అంపైర్లు.. ఇటు ఆటగాళ్లు బిత్తరపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అసలేం జరిగిందంటే.. బ్రీడీ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన దేశవాళీ టోర్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రీడీ, సీఎస్‌ఎన్‌ఐ టీమ్స్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌కు కుక్క అంతరాయం కలిగించింది. అసలే వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు.
ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో అబ్బీ లెక్కీ బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా షాట్ ఆడింది. ఫీల్డర్ బంతిని అందుకొని వికెట్ కీపర్‌వైపు విసరగా.. బంతిని అందుకున్న కీపర్ సునాయసంగా రనౌట్ చేసే అవకాశాన్ని చేజార్చింది. వికెట్లను తాకుకుండా దూరంగా వెళ్లిన బంతిని మైదానంలోకి దూసుకొచ్చి బుజ్జి కుక్క అందుకొని పరుగులు పెట్టించింది. బంతి కోసం ఫీల్డర్లంతా దాని వెనుక పరుగెత్తారు. ఇక కుక్క యాజమాని కూడా మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో కలిసి మైదానంలో పరుగెత్తాడు. చివరకు అలసిపోయిన శునక రాజు.. నాన్‌స్ట్రైకర్ బ్యాట్స్‌మన్ వద్దకు వెళ్లి బంతిని వదిలేసింది. దాంతో కఠ సుఖాంతమైంది. దీనికి సంబంధించిన వీడియోను క్రిక్ ట్రాకర్.. ఫీల్డింగ్ కోచ్ అవసరం అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేయగా వైరల్ మారింది. ఈ వీడియోను చూసి ప్రతీ ఒక్కరు నవ్వకుండా ఉండలేకపోతున్నారు.
ఐర్లాండ్ క్రికెట్ టీమ్ విషయానికి వస్తే.. జింబాబ్వేతో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. టీ20 సిరీస్‌ను ఐర్లాండ్ కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్ డిసైడర్ మ్యాచ్ సెప్టెంబర్ 13న జరగనుంది. టీ20 సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధించి ఆధిక్యంలో నిలవగా.. ఆ తర్వాత ఐర్లాండ్ దుమ్మురేపి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఫలితంగా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో పాల్ స్టిర్లింగ్ 234 రన్స్‌తో చెలరేగాడు. బౌలింగ్‌లో మార్క్ అడైర్ 10 వికెట్ల పడగొట్టాడు.
మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే జింబాబ్వే 38 పరుగులతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు 266 పరుగులు చేయగా.. ఐర్లాండ్ 228 రన్స్‌కే చేతులెత్తేసింది. వర్షం కారణంగా రెండో వన్డే రద్దయింది. మూడో వన్డే సోమవారం జరగనుంది.