
గాడిన పెట్టేందుకు..
కొంతకాలంగా హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అక్రమాలు పెచ్చుమీరడం.. జట్ల ఎంపికలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండటంతో కవిత హెచ్‌సీఏను గాడిన పెట్టాలని నిర్ణయించుకున్నారని సమాచారం. హైదరాబాద్ క్రికెట్లో అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి.. ప్రతిభావంతులకు అండగా నిలవాలని భావించి, ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టారట.
విశ్వసనీయ సమాచారం ప్రకారం... గత కొంతకాలంగా హెచ్‌సీఏ వ్యవహారాలను కవిత నిశితంగా గమనిస్తున్నారట. మేటి క్రికెటర్ అయిన అజారుద్దీన్ అధ్యక్షుడయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంపై క్రికెట్ ప్రతినిధుల దగ్గర కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

గ్రామీణ క్రీడాకారులకు అవకాశాలెలా?
హెచ్‌సీఏను దారికి తెచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కవిత ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశాలు నిర్వహించారని.. హెచ్‌సీఏ రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తులతో చర్చలు జరిపారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అవినీతికి ఎలా అడ్డుకట్ట వేయాలి? ఎక్కువ సంఖ్యలో క్లబ్‌లు ఉన్న హెచ్‌సీఏ పెద్దలను నిలువరించడం ఎలా? వారి గుత్తాధిపత్యానికి కారణమేంటి? తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైనా వాటిని క్లబ్‌లుగా హెచ్‌సీఏ ఎందుకు గుర్తించడం లేదు? ఎన్నికల్లో ఏయే గ్రూపులు తలపడతాయి? తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి ఎలా? గ్రామీణ క్రీడాకారులకు అవకాశాలెలా? వంటి అంశాలతో క్రికెట్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారట.

అవినీతి ఆరోపణలపై..
హైదరాబాద్ క్రికెట్ పరిధిలో వివిధ జట్ల సెలెక్షన్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండటం.. హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులపై అవినీతి ఆరోపణలు వస్తున్నా చర్యలు లేకపోవడాన్ని ఆమె తప్పుబట్టినట్లు సమాచారం. హెచ్‌సీఏను గాడిన పెట్టకపోతే తెలంగాణ క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే క్రికెట్ వ్యవహారాలపై దృష్టిసారించడానికి కవిత సిద్ధమైనట్లు చెబుతున్నారు. అయితే కవిత హెచ్‌సీఏ పగ్గాలు చేపడుతుందనే ప్రచారం గత రెండేళ్లుగా జరుగుతూనే ఉంది. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో హైదరాబాద్‌కు ఆతిథ్యం దక్కకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆతిథ్య దక్కకపోవడం వెనుక హెచ్‌సీఏ రాజకీయాల కారణమనే ప్రచారం జరుగుతుండటంతో అసోసియేషన్ గాడిన పెట్టాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట.

లోక్‌సభలో ప్రస్తావన...
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించాలని టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు. జీరోఅవర్ సమయంలో ఆయన మాట్లాడుతూ... ఐపీఎల్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని, అయితే కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందన్నారు. మిగతా మెట్రో సిటీలతో పోల్చితే హైదరాబాద్‌లో కరోనా కేసులు అతి తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కావాల్సిన సహకారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.


Click it and Unblock the Notifications












