హాంగ్జౌ: నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా మంగోలియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఈ 9 బంతుల్లో 8 సిక్సర్లు బాదడం విశేషం. తద్వారా భారత స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును దీపేంద్ర సింగ్ అధిగమించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కాగా.. తాజాగా దీపేంద్ర సింగ్ అధిగమించాడు.

ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ 10 బంతుల్లోనే 8 సిక్సర్లు బాది 520 స్ట్రైక్‌రేట్‌తో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీపేంద్ర సింగ్‌కు విధ్వంసానికి తోడుగా కుశాల్ మల్లా(50 బంతుల్లో 8 ఫోర్లు, 13 సిక్స్‌లతో 137 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగడంతో నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 314 పరుగుల భారీ స్కోర్ చేసింది.
టీ20 క్రికెట్ చరిత్రలోనే 300 ప్లస్ రన్స్ చేసిన తొలి జట్టుగా నేపాల్ చరిత్ర సృష్టించింది. అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా కుశాల్ మల్లా చరిత్రకెక్కాడు. 34 బంతుల్లోనే అతను సెంచరీ సాధించాడు. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 26 సిక్స్‌లు బాదిన తొలి జట్టుగా నేపాల్ చరిత్రకెక్కింది. బెస్ట్ స్ట్రైక్‌రేట్ 520 నమోదు చేసిన ఆటగాడిగా దీపెంద్ర సింగ్ నిలిచాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన మంగోలియా జట్టు 13.1 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలి 273 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత ఘోర పరాజయం కాగా.. భారీ విజయం సాధించిన జట్టుగా నేపాల్ రికార్డు సృష్టించింది. మంగోలియా బ్యాటర్లలో జమ్యన్ సురేన్(10) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోర్ అందుకోగా.. ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు.
మంగోలియా టీమ్ చేసిన 41 పరుగుల్లో 23 రన్స్ ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చినవే. ఈ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం విశేషం. నేపాల్ బౌలర్లలో అవినాష్ బోహరా, సందీప్ లమిచ్చనే, కరణ్ కేసీ రెండేసి వికెట్లు తీయగా.. సోంపల్ కమీ, దీపేంద్ర సింగ్, కుశాల్ బుర్టేల్ తలో వికెట్ తీసారు.