న్యూఢిల్లీ: భారత సెలెక్టర్లపై వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దులీప్ ట్రోఫీలో భాగాంగా సౌత్ జోన్ టీమ్ ఎంపికను కార్తీక్ తప్పుబట్టాడు. తమిళనాడుకు చెందిన బాబా ఇంద్రజీత్‌ను సౌత్ జోన్ టీమ్‌లోకి ఎందుకు తీసుకోలేదో తనకు అర్థం కావడం లేదన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడకు మారు పేరు అయిన బాబా ఇంద్రజీత్‌తో పాటు విజయ్ శంకర్‌కు సౌత్ జోన్ టీమ్‌లో చోటు దక్కలేదు.
ఈ ఇద్దరి ఆటగాళ్లను పక్కన పెట్టడంపై దినేశ్ కార్తీక్.. ట్విటర్ వేదికగా సెలెక్టర్లను నిలదీశాడు. ఈ ఏడాది మార్చ్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన బాబా ఇంద్రజీత్‌ను దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నాడు.

'ఈ రోజుల్లోని సెలెక్షన్ కమిటీ నాకు ఏ మాత్రం అర్థం కావడం లేదు. ఈ ఏడాది మార్చి తొలి వారంలో మధ్య ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తరఫున బాబా ఇంద్రజీత్ ఆడాడు. అనంతరం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా జరగలేదు. కానీ దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ టీమ్‌లో బాబా ఇంద్రజీత్‌కు అవకాశం దక్కలేదు. ఎందుకో ఎవరైనా చెప్పగలరా?'అని దినేశ్ కార్తిక్ సెటైరికల్‌గా ప్రశ్నించాడు.
ఈ ట్వీట్‌పై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'ఛీ ఛీ.. ఈ సెలెక్టర్లు ఉన్నారే..! ఎప్పటికీ అర్థం కారు!'అనే రీతిలో కార్తీక్ ట్వీట్ ఉందని కామెంట్ చేస్తున్నారు.
జూన్ 28 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుండగా... తెలుగు ఆటగాడు హనుమ విహారీని సౌత్ జోన్ సారథిగా ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన కేఎస్ భరత్, రికీ భుయ్, తిలక్ వర్మలు చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఐపీఎల్‌లో అదరగొట్టిన సాయి సుదర్శన్ కూడా జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన వాషింగ్టన్ సుందర్ కూడా తిరిగి మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.
సౌత్ జోన్ జట్టు: హనుమ విహారి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్ (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రికీ భుయ్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, సమర్థ్, తిలక్ వర్మ, సచిన్ బాబీ, సాయి కిశోర్, కావేరప్ప, వైశాక్ విజయ్ కుమార్, ప్రదోష్ రంజన్ పాల్, కేవీ శశికాంత్, దర్శన్ మిసాల్