టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోనే ఉన్నాడని, చెత్త షాట్లతోనే ఔటవుతున్నాడని మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ 18 పరుగులే చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్ స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెస్ట్ ఫార్మాట్‌కు రోహిత్ వీడ్కోలు పలకడం మంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యంపై స్పందించిన దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ఫామ్ కోల్పోలేదని, అతను ఆడే షాట్స్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందన్నాడు. ఫామ్ కోల్పోతే అలాంటి షాట్స్ ఆడలేరని చెప్పాడు. షాట్ సెలెక్షన్ విషయంలో రోహిత్ తప్పు చేస్తున్నాడని, చెత్త షాట్లతో మూల్యం చెల్లించుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు.
ఫామ్‌లోనే ఉన్నాడు..
'రోహిత్ శర్మ ఫామ్‌లోనే ఉన్నాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అతను ఆడే షాట్స్‌ను చూసే ఈ విషయం చెబుతున్నాను. ఫామ్‌లో లేనప్పుడు అలాంటి షాట్స్ ఆడటం అంత సులువు కాదు. మంచి బంతి బ్యాక్ ఫుట్ పంచ్ ఆడటం.. లెంగ్త్ మిస్సైన బాల్‌ను కవర్ డ్రైవ్‌గా తరలించడం చూస్తేనే రోహిత్ శర్మ ఫామ్‌లో ఉన్నాడే విషయం అర్థమవుతోంది.
షాట్ సెలెక్షన్ విషయంలో రోహిత్ శర్మ తప్పిదం చేస్తున్నాడు. రోహిత్ శర్మ వరల్డ్ క్లాస్ ప్లేయర్. అతను ఆడే టెంపో అసాధారణమైనది. కానీ షాట్స్ ఎంపికనే సరిగ్గా లేదు. బంతి నాలుగో స్టంప్‌పై ఉన్నప్పుడు.. ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమస్యపై అతను ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఎందుకంటే అతని దగ్గర ఇంకా మెరుగైన షాట్స్ ఉన్నాయి. భారత్‌కు ఇది చెత్త సిరీస్. మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
బలహీనతగా మారింది..
మరోవైపు రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో సాంకేతిక లోపం ఉందని మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఈ సమస్య రోహిత్ శర్మకు బలహీనతగా మారిందన్నాడు. రోహిత్ శర్మ పేస్ బౌలర్లకు ఒకే రీతిలో ఔటవుతున్నాడని చెప్పాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రోహిత్ శర్మను పేసర్లు ఇబ్బంది పెడుతున్నారని, ఇది ఆందోళన పరిచే విషయమన్నాడు.
'బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో కూడా రోహిత్ శర్మ ఇలానే ఔటయ్యాడు. టీమ్ సౌథీ ఈ విషయాన్ని పసిగట్టి అదే బంతితో ఔట్ చేశాడు. తాజాగా మ్యాట్ హెన్రీ అదే ఫార్మూలాతో బౌలింగ్ చేసి రోహిత్ శర్మను పెవిలియన్ చేర్చాడు.ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో షార్ట్ పిచ్ బాల్ వేసి రోహిత్ శర్మను బోల్తా కొట్టిస్తున్నారు.
ఫోకస్ పెట్టాల్సిందే..
ఈ బంతి ఆడే విషయంలో రోహిత్ స్క్వేర్ అప్ అవుతూ ఇబ్బంది పడుతున్నాడు. ఈ బంతి ఏ మాత్రం స్వింగ్ అవ్వడం లేదు. బౌలర్లు డెక్‌తో హిట్ చేసి రోహిత్ శర్మను ట్రాప్ చేస్తున్నారు. బంతి స్వింగ్ అవుతుందేమోనని పొరబడి రోహిత్ మూల్యం చెల్లించుకుంటున్నాడు. వీలైనంత త్వరగా రోహిత్ ఈ సమస్యను అధిగమించాలి. లేకుంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ బౌలర్లు కూడా ఇదే అస్త్రాన్ని ఉపయోగిస్తారు.'అని అనిల్ కుంబ్లే హెచ్చరించాడు.