
చెన్నై: ఆస్ట్రేలియా తాత్కలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై టీమిండియా వెటరన్ దినేశ్ కార్తీక్ ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుత కెప్టెన్సీతో స్మిత్ ఆస్ట్రేలియాకు వన్డే సిరీస్ అందించాడని కొనియాడాడు. చెన్నై వేదికగా జరిగిన చివరి వన్డేలో స్మిత్ కెప్టెన్సీ స్పాట్ ఆన్‌గా ఉందని, మైదానంలో అతను అనుసరించిన వ్యూహాలు అమోఘమని ప్రశంసించాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగులతో టీమిండియాను ఓడించి 2-1తో సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ర్యాంక్ అందుకుంది.
ఈ మ్యాచ్ ఫలితంపై క్రిక్‌బజ్‌తో మాట్లాడిన దినేశ్ కార్తీక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఇగోను టచ్ చేసి మరి స్మిత్ వికెట్ సాధించాడని వివరించాడు. 'గేమ్ హోరాహోరీగా సాగుతుండగా స్టీవ్ స్మిత్ తెలివిగా ఫీల్డ్‌లో మార్పులు చేశాడు. క్రీజులో సెట్ అయిన హార్దిక్ పాండ్యాను ఔట్ చేసేందుకు అద్భుతమైన వ్యూహాన్ని రచించాడు. అతని ఇగోను టచ్ చేసి వికెట్ సాధించాడు. స్ట్రెయిట్ లాంగ్ ఆన్‌లో ఫీల్డర్ పెట్టాను. దమ్ముంటే క్లియర్ చేయ్ అని తన చర్యలతో హార్దిక్ పాండ్యాకు సవాల్ విసిరాడు.
హార్దిక్ పాండ్యా తన ఇన్నింగ్స్ ప్రారంభంలో ఎక్కువగా స్వీప్ షాట్స్ ఆడాడు. కానీ జంపా బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డర్ లేకున్నా స్వీప్ షాట్ ఆడలేదు. సిక్స్ కొట్టాలని గట్టిగా అనుకున్నాడు. స్మిత్ కూడా ఇదే ఊహించి అతన్ని రెచ్చగొట్టేలా ఫీల్ట్ సెట్ చేసి ఫలితాన్ని రాబట్టాడు.'అని దినేశ్ కార్తీక్ వివరించాడు.

వ్యూహాత్మక తప్పిదంతో కోహ్లీ ఔటయ్యాడని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. అష్టన్ అగర్ ఆఖరి ఓవర్‌లో కోహ్లీ షాట్ కొట్టాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు.'కోహ్లీ అద్బుతంగా తన ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. స్పిన్ బౌలింగ్‌లో కాస్త ఇబ్బంది పడినా.. తన శైలిలో ఎదుర్కొన్నాడు. కానీ వ్యూహాత్మక తప్పిదం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. అష్టన్ అగర్ ఆఖరి ఓవర్‌లో చాలా ఆలస్యంగా షాట్ ఆడాడు. అంతకు ముందు ఓవర్‌లో కూడా ఇదే తరహా షాట్ ఆడి తృటిలో తప్పించుకున్నాడు.
జట్టును విజయం వైపు నడిపించే అవకాశాన్ని చేజార్చుకున్నందుకు కోహ్లీ చాలా బాధపడ్డాడు. ఉన్నంత సేపు తనకే సాధ్యమైన ఆటతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పెద్ద షాట్లు ఆడకుండా క్విక్ సింగిల్స్, డబుల్స్ తీసాడు. అష్టన్ అగర్ బౌలింగ్‌లో అతను ఆడిన ఇన్‌సైడ్ ఔట్ షాట్ పట్ల చాలా గర్వంగా ఫీలయ్యి ఉంటాడు.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.