దేశవాళీ క్రికెట్‌లో పరుగుల మోత మోగిస్తున్న కరుణ్ నాయర్ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ వరుసగా ఏడు ఇన్నింగ్స్‌ల్లో 112 నాటౌట్, 44 నాటౌట్, 163 నాటౌట్, 112, 122 నాటౌట్, 88 నాటౌట్‌లతో మొత్తం 752 పరుగులు చేశాడు.
ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 75.2 సగటుతో ఐదు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతను ఒకే ఒక్కసారి ఔటయ్యాడు. అసాధారణ ప్రదర్శనతో విదర్భ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ ప్రదర్శన నేపథ్యంలో కరుణ్ నాయర్‌ను భారత జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

ఇంగ్లండ్‌తో అప్‌కమింగ్ వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో కరుణ్ నాయర్‌కు చోటు దక్కుతుందని అంతా అనుకుంటున్నారు. అయితే టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మాత్రం భిన్నంగా స్పందించాడు.
ఎన్ని పరుగులు చేసినా కరుణ్ నాయర్‌కు చోటు దక్కదని స్పష్టం చేశాడు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన జట్టు ఖరారైందని, కొత్తవారికి అవకాశం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
'దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతుండటంతో కరుణ్ నాయర్ పేర్ ఇప్పుడు బాగా వినిపిస్తోంది. మయాంక్ అగర్వాల్ కూడా బాగానే ఆడాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత వన్డే జట్టు ఇప్పటికే సిద్దమైందని అనుకుంటున్నా. జట్టులో పెద్దగా మార్పులు కూడా ఉండకపోవచ్చు. దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న కరుణ్ నాయర్‌ను తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
రీఎంట్రీ ఇచ్చేందుకు అతనికి హక్కు ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అతనికి అవకాశం వస్తుందని మాత్రం అనుకోవడం లేదు. పేస్, స్పిన్‌ను సమర్థవంతంగా ఆడే బ్యాటర్‌ను వదులుకోకూడదు. అతను గన్ షాట్ ప్లేయర్. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అతను జట్టులోకి వస్తే మాత్రం సంతోషిస్తా.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్లను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది.