టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సారథిగా పనికిరాడని మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. బుమ్రాను కెప్టెన్ చేయాలనే ఆలోచనే సరికాదని అభిప్రాయపడ్డాడు. బుమ్రా నాయకత్వ బాధ్యతలు చేపడితే అతని బౌలింగ్‌పై ప్రభావం చూపుతుందన్నాడు. టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 గెలవడంలో జస్‌ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ పేసర్‌గా బుమ్రా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. వైవిధ్యమైన బౌలింగ్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ.. భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బుమ్రా.. సారథ్య బాధ్యతలు చేపట్టడంపై ఆసక్తికనబర్చాడు. పేస్ బౌలర్లకు కెప్టెన్‌గా అవకాశాలు రావడం లేదని కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్‌లతో పాటు ప్యాట్ కమిన్స్ కెప్టెన్లుగా సక్సెస్ అయ్యారని, ప్రపంచకప్ టైటిళ్లను కూడా గెలిచారని బుమ్రా ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించాడు. అయితే బుమ్రా వ్యాఖ్యలతో సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చకు తెరలేసింది.
కొందరు కెప్టెన్సీకి బుమ్రా సరైనోడే అంటే.. మరికొందరు మాత్రం అతను పనికిరాడని కామెంట్ చేస్తున్నారు. కెప్టెన్సీ అతని బౌలింగ్‌పై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. తాజాగా దినేశ్ కార్తీక్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బుమ్రాను కోహినూర్ వజ్రంతో పోల్చిన దినేశ్ కార్తీక్.. కెప్టెన్సీకి మాత్రం అతను పనికిరాడని స్పష్టం చేశాడు.
'జస్‌ప్రీత్ బుమ్రా ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం అన్ని ఫార్మాట్లలో ఆడటం చాలా కష్టం. ముఖ్యంగా పేసర్లకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అత్యంత కీలకం. ఎప్పటికప్పుడు అతని పరిస్థితిపై సమీక్షిస్తూ ఉండాలి. ఇలాంటి బౌలర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కీలకమైన మ్యాచ్‌ల్లోనే అతన్ని బరిలోకి దించాలి. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే అతనిపై మరింత ఒత్తిడి పెరుగుతోంది.'అని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం జస్‌ప్రీత్ బుమ్రా రెస్ట్ తీసుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్ విజయానంతరం ఇంటికే పరిమితమైన బుమ్రా.. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌తో బుమ్రా మళ్లీ రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.