
న్యూఢిల్లీ: టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడంపై వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సంతోషం వ్యక్తం చేశాడు. తన కల నెరవేరిందని ట్వీట్ చేశాడు. ఇక 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై జట్టు వివరాలను వెల్లడించింది. అంతా ఊహించనట్లుగానే గాయాలతో జట్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ పునరాగమనం చేయగా.. ఆసియాకప్ 2022లో విఫలమైన ఆవేశ్ ఖాన్‌పై వేటు పడింది. టీమ్ కాంబినేషన్ నేపథ్యంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను కూడా టీమ్‌మేనేజ్‌మెంట్ పక్కనపెట్టి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేసింది.
మహమ్మద్ షమీ జట్టులోకి వస్తాడని ప్రచారం జరిగినా అతన్ని బుమ్రా బ్యాకప్‌గా మాత్రమే సెలెక్టర్లు పరిగణించారు. అతనితో పాటు దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్‌లను స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేసింది. ఆసియాకప్ బరిలోకి దిగిన జట్టులో కేవలం మూడు మార్పులు మాత్రమే చేసింది. గాయంతో దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకుంది. రిషభ్ పంత్‌ను పక్కనపెడతారని ప్రచారం జరిగినా.. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ నేపథ్యంలో దినేశ్ కార్తీక్‌తో పాటు కొనసాగించింది. అయితే ఆసియా కప్ 2022 వైఫల్యం నేపథ్యంలో దినేశ్ కార్తీక్‌నే ప్రధాన వికెట్ కీపర్‌గా టీమిండియా కొనసాగించే అవకాశం ఉంది.
అప్పుడెప్పుడో 2006లో సౌతాఫ్రికాతో భారత జట్టు ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన దినేశ్ కార్తీక్ ఇప్పటి వరకు కొనసాగడం విశేషం. 2019వన్డే ప్రపంచకప్ అనంతరం పూర్తిగా జట్టుకు దూరమైన దినేశ్ కార్తీక్.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడాడు. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున బరిలోకి దిగడం అతని రాతను మార్చింది. ఫినిషర్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చిన డీకే.. చాలా రోజుల తర్వాత భారత జట్టులోకి వచ్చి దుమ్మురేపాడు. దాంతో ఆసియా కప్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ 2022 ఆడాలనే తన లక్ష్యం నెరవేరడంతో కార్తీక్ ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. కలనేరవేరిందంటూ పేర్కొన్నాడు. ఇక అభిమానులు అతనికి విషెస్ తెలియజేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటాలని ఆకాంక్షిస్తున్నారు.