టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆటగాడిగా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. గతేడాదే అన్ని రకాల భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దినేశ్ కార్తీక్.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని పర్యవేక్షణలో ఆర్‌సీబీ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలుచుకుంది. ఓవైపు కోచ్‌గా రాణిస్తూనే.. మరోవైపు కామెంటేటర్‌గా కూడా దినేశ్ కార్తీక్ కొనసాగుతున్నాడు.
భారత క్రికెట్ నుంచి తప్పుకోవడంతో ఇతర దేశాల ఫ్రాంచైజీ లీగ్స్‌లోకి కూడా కార్తీక్ అడుగుపెట్టాడు. ఇప్పటికే సౌతాఫ్రికా 20 లీగ్‌లో ఆడాడు. తాజాగా మరో టోర్నీలో పాల్గొనేందుకు సిద్దమయ్యాడు. హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీ 2025లో భారత జట్టుకు దినేష్ కార్తీక్ సారథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని హాంగ్ కాంగ్ క్రికెట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

'హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీ 2025లో భారత జట్టు కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్‌ను స్వాగతిస్తున్నందుకు మేం చాలా గర్వపడుతున్నాం. దినేశ్ కార్తీక్‌కు ఉన్న అపారమైన అంతర్జాతీయ అనుభవం, గొప్ప నాయకత్వ లక్షణాలు, మెరుపు బ్యాటింగ్.. ఈ టోర్నీకి మరింత గుర్తింపుతో పాటు తీవ్రతను తీసుకు వస్తుంది. ఆయన ఎంపిక సిక్సెస్ టోర్నీ స్ఫూర్తి, ఫియర్‌లెస్, వరల్డ్ క్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రతిబింబిస్తుంది. నవంబర్ 7-9 మధ్య హాంగ్ కాంగ్ వేదికగా జరిగే ఈ ప్రపంచ క్రికెట్ వేడుకలో మాతో భాగమవ్వండి.'అని హాంగ్ కాంగ్ క్రికెట్ ట్వీట్ చేసింది.
హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కడం గొప్ప గౌరవమని దినేశ్ కార్తీక్ తెలిపాడు. 'అద్భుతమైన రికార్డులు ఉన్న ఆటగాళ్ల గ్రూప్‌కు సారథ్యం వహించేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను. మేమంతా కలిసి అభిమానులను అలరిస్తాం. ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.'అని కార్తీక్ పేర్కొన్నాడు.
ఈ టోర్నీలో దినేశ్ కార్తీక్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆడనున్నాడు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అశ్విన్ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి. గతేడాది ఈ టోర్నీలో రాబిన్ ఉతప్ప నాయకత్వంలో ఆడిన భారత జట్టు తీవ్రంగా నిరాశపర్చింది. ఆ జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో ఓడి తొలి దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.