
చెన్నై: ఎలాంటి బంతులనైనా అలవోకగా సిక్సర్లుగా మలిచే సామర్థ్యమే టీమిండియా యువ హిట్టర్ ఇషాన్ కిషన్ ప్రత్యేకతని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఇంగ్లండ్‌తో మొతేరా మైదానం వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. సూపర్బ్ బ్యాటింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. తనదైన షాట్లతో అలరించిన ఈ జార్ఖండ్ కుర్రాడు అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు.
ఆదిలోనే కేఎల్ రాహుల్ (0) పెవిలియన్ చేరినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (73 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. దూకుడుగా ఆడి ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలోనే రెండో వికెట్‌కు కీలకమైన 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలో ఇషాన్ బ్యాటింగ్‌పై స్పందించిన దినేశ్ కార్తీక్ ఓ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్ ప్రత్యేకత ఏంటో వివరించాడు.'సెకండ్ టీ20లో ఇషాన్ కిషన్ కొన్ని అత్యద్భుతమైన షాట్లు ఆడాడు. అతను ఇన్నింగ్స్ ప్రారంభించిన విధానం.. ఆత్మవిశ్వాసం.. ఎలాంటి బంతులనైనా అలవోక సిక్సర్లుగా మలిచే అతని సామర్థ్యంపై ఉన్న నమ్మకం.. లాంటి విషయాలు ఇతరులతో అతడిని వేరు చేస్తాయి.
పవర్ హిట్టర్ అంటే ఇలాగే ఉండాలి. టాప్ ఆర్డర్‌లో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తెచ్చే బ్యాట్స్‌మన్ కావాలి. జోఫ్రా ఆర్చర్‌పై తొలి బంతి నుంచే ఇషాన్ ఒత్తిడి తెచ్చాడు. అది టీమిండియాకు శుభపరిణామం' అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.