
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌పై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మిచెల్ స్టార్క్ అత్యుత్తమ బౌలరని కొనియాడాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిదిల కంటే కూడా స్టార్కే మేటి బౌలరని చెప్పుకొచ్చాడు. టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో స్టార్క్ సత్తా చాటాడు. తొలి వన్డేల్లో మూడు వికెట్లు తీసి భారత్‌ను భయపెట్టిన స్టార్క్.. రెండో వన్డేలో ఐదు వికెట్లతో రోహిత్ సేన పతనాన్ని శాసించాడు. స్టార్క్ దెబ్బకు 117 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.
ఈ మ్యాచ్ ఫలితంపై క్రిక్‌బజ్ షోలో మాట్లాడిన దినేశ్ కార్తీక్.. మిచెల్ స్టార్క్ వల్లే భారత్ ఓటమిపాలైందని చెప్పాడు. 'బెస్ట్ వైట్ బాల్ బౌలర్ ఎవ్వరంటే చాలా మంది జస్‌ప్రీత్ బుమ్రా, షాహీన్ ఆఫ్రిది పేర్లు చెబుతారు. కానీ ఈ తరంలో బెస్ట్ వైట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఒక్కడే. బుమ్రా అయినా ఆఫ్రిదీ అయినా అతని తర్వాతే. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఎలాంటి బ్యాటర్‌కు అయినా చాలా కష్టం. క్రీజులో ఎలాంటి బ్యాటర్ ఉన్నా.. అతన్ని మొదటి బంతికే ఔట్ చేసే సత్తా మిచెల్ స్టార్క్‌కు ఉంది. సూర్యకుమార్ యాదవ్ లాంటి మేటి బ్యాటర్‌ను స్టార్క్, రెండు మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు.
లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ల బౌలింగ్‌ను ఎదుర్కొనేటప్పుడు బ్యాటర్లు కొద్దిగా ఇబ్బంది పడతారు. షాహీన్ ఆఫ్రిది, ట్రెంట్ బౌల్ట్ సక్సెస్‌కు ఇదే కారణం. అయితే మిచెల్ స్టార్క్ మాత్రం ఈ ఇద్దరికి భిన్నం. ఇలాంటి సత్తా ఉన్న బౌలర్లు మన దగ్గర కూడా ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయడం, నెట్స్‌లో బౌలింగ్ చేయడం ఒక్కటి కాదు. అందుకే మన బౌలర్లు కీలక మ్యాచుల్లో విఫలమవుతున్నారు. వన్డే వరల్డ్ కప్‌లో మిచెల్ స్టార్క్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు పెద్ద సవాలే.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
రెండో వన్డేల్లో ఐదు వికెట్లు తీయడం ద్వారా స్టార్క్ అరుదైన ఘనతను అందుకున్నాడు. స్టార్క్ వన్డే కెరీర్‌లో ఇది 9వ ఐదు వికెట్ల ఘనత కాగా.. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. వకార్ యూనిస్ 262 మ్యాచుల్లో 13 సార్లు ఐదేసి వికెట్లు తీస్తే, ముత్తయ్య మురళీ ధరన్ 350 మ్యాచుల్లో 10 సార్లు ఈ ఫీట్ సాధించాడు. మిచెల్ స్టార్క్ మాత్రం కేవలం 109 మ్యాచుల్లోనే 9 సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు. అంతేకాకుండా గత రెండు వన్డే ప్రపంచకప్‌ల్లో స్టార్క్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.