
ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ రాకతో భారత జట్టులో తన తలుపులు మూసుకుపోయాయని భావించానని వెటరన్ క్రికెటర్, యంగ్ కామెంటేటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ధోనీ తన రాకతోనే భారతదేశాన్ని ఊపు ఊపేశాడని తెలిపాడు. వికెట్ కీపర్‌గా అవకాశం లేకపోవడంతో స్పెషలిస్టు బ్యాటర్‌గా ప్రయత్నించాలని ధోనీ, రాహుల్ ద్రవిడ్ తనను ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న దినేశ్ కార్తీక్.. భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. చాలాకాలం జట్టుకు దూరమైన దినేశ్ కార్తీక్ 2019 ప్రపంచకప్ ముందు టీమిండియాలో పునరాగమనం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొట్టి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
యువకులకు ప్రాధాన్యమిస్తున్న క్రమంలో దినేశ్ కార్తీక్‌ను జట్టు యాజమాన్యం పక్కన పెట్టింది. దాంతో అతను దేశవాళీ, ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు అనూహ్యంగా కామెంటేటర్ అవతారమెత్తాడు. తనదైన వ్యాఖ్యానంతో దుమ్ము లేపుతున్నాడు. తాజాగా ఆకాశ్ చోప్రా యూట్యుబ్ చానెల్‌తో మాట్లాడిన కార్తీక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'అవకాశాలు రాలేదని నేనెప్పుడూ కుంగిపోలేదు. తర్వాత ఏం చేయాలన్న దానిపైనే నా దృష్టి ఉంటుంది. నేనెప్పుడూ అదే ప్రశ్న వేసుకొనేవాడిని. ఒకానొక సమయంలో నేను స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ అవతారం ఎత్తాల్సి వచ్చింది. అప్పుడు మిడిలార్డర్ లేదా ఓపెనర్‌గానే అవకాశం ఉంది. నేను ప్రతిభావంతుడినని, మంచి బ్యాట్స్‌మన్ అని ధోనీ సహా అంతా ప్రోత్సహించారు. వారి మాటలు నాకు ఆత్మవిశ్వాసం ఇచ్చాయి. స్పెషలిస్టు బ్యాటర్‌గా రాణించే నైపుణ్యాలు నాకున్నాయని రాహుల్ ద్రవిడ్ సైతం అన్నారు.
దాంతో నేను దేశవాళీ క్రికెట్‌కు వెళ్లి భారీ పరుగులు చేశాను. ఆ తర్వాత ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకొని రాణించాను. ధోనీ తన రాకతో దేశమంతా తుపాను సృష్టించాడు. దాంతో నాకిక తలుపులు మూసుకు పోయాయని భావించాను. ఎందుకంటే భారత్‌లో వికెట్ కీపింగ్ అంటే దశాబ్ద కాలం చేయాల్సిన పని. గతంలో సయ్యద్ కీర్మాణి, కిరణ్ మోరె అలాగే చేశారు. ధోనీ సైతం తరానికి ఒక్కడు' అని డీకే వెల్లడించాడు.' ఇక భారత్-ఇంగ్లండ్ మధ్యే జరిగిన ఫస్ట్ టెస్ట్ వర్షంతో డ్రాగా ముగియగా.. రెండో టెస్ట్ లార్డ్స్ వేదికగా గురువారం ప్రారంభం కానుంది.
దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, కేకేఆర్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. 2018 నుంచి కేకేఆర్‌కు ఆడుతున్నాడు. 2020 సీజన్ మధ్యలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను వదులుకున్నాడు. ఐపీఎల్ 2021 ఫస్టాఫ్ సీజన్ కూడా ఆడాడు.